వైసీపీకి దిక్కుతోచకే బురదజల్లుతోంది : ఎమ్మెల్యే నాని
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:58 AM
‘అధికారాన్ని కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ ప్రతి దానిపైనా బురదజల్లే కార్యక్రమాలు చేస్తోంది. అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా డీఎస్సీ అభ్యర్థుల బాధను అర్థం చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చారా..’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రశ్నించారు.
తిరుపతి సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ‘అధికారాన్ని కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ ప్రతి దానిపైనా బురదజల్లే కార్యక్రమాలు చేస్తోంది. అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా డీఎస్సీ అభ్యర్థుల బాధను అర్థం చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చారా..’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రశ్నించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2025 డీఎస్సీ ఎంతో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తే, దానిపై కోర్టులో కేసులు వేయడం, కోర్టులో చీవాట్లు పెట్టిన వినిపించుకోక మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగా నిరసనలు తెలపడం సరికాదన్నారు. ఇవన్నీ చూస్తుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుపడుతున్నట్లుగా ఉందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, మంత్రి నారా లోకేశ్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టడంతో ఓర్వలేకనే వైసీపీ ఇలా చేస్తోందని ఆగ్రహించారు. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా ఆపార్టీకి డిపాజిట్లు రావని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, గణపతి నాయుడు, శ్రీధర్ నాయుడు, శీను, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.