Share News

రైల్వేకోడూరులోని ప్రభుత్వ స్థలాలకు వైసీపీ కార్యకర్త స్కెచ్‌

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:20 AM

కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఓ వైసీపీ కార్యకర్త.. రైల్వేకోడూరులో చక్రం తిప్పుతున్నాడు. తన అక్రమ వ్యవహారాలను కొనసాగిస్తున్నాడు.

  రైల్వేకోడూరులోని ప్రభుత్వ స్థలాలకు వైసీపీ కార్యకర్త స్కెచ్‌
రాఘవరాజపురం వద్ద వంకను చదును చేశారిలా..

కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఓ వైసీపీ కార్యకర్త.. రైల్వేకోడూరులో చక్రం తిప్పుతున్నాడు. తన అక్రమ వ్యవహారాలను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికీ రెవెన్యూ శాఖలో హవా చాటుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- రైల్వేకోడూరు, ఆంధ్రజ్యోతి

రైల్వేకోడూరులోని సర్వే నెంబరు 650/1లో 1.48 ఎకరాల భూమిని సదరు వైసీపీ కార్యకర్త కొనుగోలు చేశాడు. ఈ స్థలానికి రోడ్లు తదితరాల కోసం గుంజననది పొరంబోకులో 57సెంట్లను కలుపుకున్నాడు. అక్కడితో ఆగకుండా తప్పుడు సర్వే నెంబరుతో ఏకంగా నదీ స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం విస్మయం కలిగిస్తోంది. కలుపుకున్న స్థలం విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈస్థలం గుంజననదికి చెందిందని 2023లోనే అప్పటి ఇరిగేషన్‌ డీఈ స్పష్టం చేశారు. ఆక్రమణలను తొలగించాలని కోరుతూ అప్పటి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అప్పట్లో గోడను కూల్చివేసి అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు. కొన్నాళ్లకు ఆ బోర్డు కనిపించలేదు. ఆక్రమిత స్థలంలో ఆ వ్యక్తి మళ్లీ గోడ నిర్మించేశాడు. నది పొరంబోకు స్థలం తమది కాదని అతనికి భూమి అమ్మినవారు చెబుతున్నారు. తమకు సర్వహక్కులు ఉన్న స్థలాన్ని మాత్రమే విక్రయించామంటున్నారు.

వంక స్థలానికీ ఎసరు

సదరు ఆక్రమణదారుడు రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజపురం పంచాయతీ పరిధిలో 40సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఈ స్థలానికి ముందు భాగంలో 10 సెంట్ల వంక భూమి ఉంది. దీనిమీద కన్నేసి గుట్టుచప్పుడు కాకుండా ఆ స్థలంలో గతేడాది పైపులు వేయించాడు. అదను చూసుకుని వంక మొత్తాన్ని పూడ్చేశాడు. ఈ విషయంలో అధికారులూ సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమిత వంక స్థలం ప్రధాన మార్గంలో ఉండటంతో కోట్ల రూపాయల విలువ చేస్తుంది. దీనిపై కొందరు ఆందోళన చేశారు. అయితే రాజకీయ ప్రమేయంతో సర్దుమణిగింది.

హైవే అథారిటీ స్థలంపై కన్ను

రైల్వేకోడూరులో కొన్నాళ్లపాటు ఓ వెలుగు వెలిగిన ఓ సినిమా హాలు.. తర్వాత నష్టాల బాట పట్టింది. దీంతో హాలు యజమానుల నుంచి సదరు వ్యక్తి మరికొందరితో కలిసి దానిని కొనుగోలు చేశాడు. అయితే దీని రిజిస్ర్టేషన్‌ వివాదం కొన్నాళ్లపాటు నడిచింది. ఇటీవల హాలును కూల్చివేసి ఆ స్థలాన్ని చదును చేశారు. ఆ స్థలంలో ఇళ్ల ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు పూనుకున్నాడు. అయితే సినిమా హాలుకు ముందుభాగంలో నేషనల్‌ హైవే అథారిటీకి చెందిన సుమారు 50 సెంట్ల స్థలం ఉంది. ఇందులో కొన్నేళ్లుగా పేదలు దుకాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పుడు సదరు వ్యక్తి వారిని ఖాళీ చేయించి స్థలాన్ని కొట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు నెలలుగా ఇక్కడి దుకాణదారుల్ని బెదిరిస్తున్నాడు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇతడి ఆక్రమణల విషయమై తహసీల్దార్‌ కోనేటి అమర్‌నాథ్‌ను వివరణ కోరగా.. గతంలో జరిగిన విషయాలు తనకు తెలియవన్నారు. వంకలు, వాగులు, నదీ పొరంబోకు స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. నదీ పొరంబోకు స్థలం రిజిస్ట్రేషన్‌ విషయమై పుల్లంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ రఫీ స్పందిస్తూ.. రెవెన్యూ అధికారుల పత్రాలు లేకుండా, డాక్యుమెంటేషన్‌ సక్రమంగా లేకుంటే రిజిస్ర్టేషన్‌ చేసేది లేదన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:20 AM