Share News

ఇద్దరిని బలిగొన్న రాంగ్‌ డ్రైవింగ్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:42 AM

డ్రైవరు స్థానంలో క్లీనర్‌ నడుపుతూ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ దారితప్పింది

ఇద్దరిని బలిగొన్న రాంగ్‌ డ్రైవింగ్‌
దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు (ఇన్‌సెట్‌లో) పురుషోత్తం, యశ్వితశ్రీ మృతదేహాలు - ప్రమాదానికి కారణమైన లారీ

పుల్లంపేట, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : డ్రైవరు స్థానంలో క్లీనర్‌ నడుపుతూ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ దారితప్పింది.తిరుపతి నుంచి కడపకు వెళుతున్న నాన్‌స్టా్‌ప ఆర్టీసీ లగ్జరీ బస్సును ఎదురుగా వెళ్లి వేగంగా ఢీకొట్టింది.బస్సు ఒకవైపు కోసుకుపోయిందంటే లారీ ఎంత వేగంతో ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.హైవేలో రాత్రి వేళ క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట సమీపంలో వున్న కడప -చెన్నై రహదారిపై ఆదివారం రాత్రి ఒంటిగంటకు జరిగిన రోడ్డు ప్రమాద భీతావహ దృశ్యమిది. ఈ ప్రమాదంలో పది నెలల బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడ్డ 16 ఏళ్ల యువతిని హాస్పిటల్‌కి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సమాచారం తెలిసిన వెంటనే రైల్వేకోడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి క్షతగాత్రులందరినీ హుటాహుటిన పోలీసు వాహనాలు, 108 అంబులెన్సుల్లో రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోనే మృతిచెందిన పది నెలల బాలుడు పురుషోత్తం మృతదేహాన్ని చూసి అందరూ చలించిపోయారు. తీవ్రంగా గాయపడిన యశ్వితశ్రీ(16)ని రాజంపేటలో ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది.తీవ్రంగా గాయపడిన కె.పవన్‌, రమ్య, కృష్ణమోహన్‌, నాగేంద్ర, ఉదయశ్రీ, బస్సు డ్రైవర్‌ ఇంద్రసేనారెడ్డి, ప్రభాకర్‌, బాలరాజు, యశ్వితశ్రీలను కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా బి.నాగరాజు, కె.ప్రసన్న, జ్ఞానేశ్వరి, మరికార్తీక్‌, టి.మణి, కె.దినకర్‌లను తిరుపతికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిర్ణీత సమయానికి ముందే...

ప్రమాదానికి గురైన బస్సు తిరుపతిలో సోమవారం తెల్లవారుజామున బయలుదేరాలి.అయితే బస్టాండులో కడప ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఆదివారం రాత్రి 11 గంటలకే బయల్దేరదీశారు.మార్గమధ్యంలోని పుల్లంపేటలో ఓ కేఫ్‌ వద్ద బస్సును నిలిపారు. అక్కడ టీ తాగాక బయల్దేరిన బస్సును కొంతసేపటికే ఎదురుగా రాంగ్‌రూట్లో వచ్చిన లారీ ఢీకొట్టింది.

ప్రమాద స్థలిని పరిశీలించిన ఏఎస్పీ, ఆర్డీవో

ప్రమాద స్థలిని ఏఎస్పీ రవిమనోహరాచారి, ఆర్డీవో రామ్మోహన్‌ పరిశీలించారు.ప్రమాదం ఎలా జరిగింది, క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో వైద్యం అందుతోందా అని ఆరా తీశారు.ఆర్డీవో రాజంపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం పూర్తయ్యేవరకు పోలీసులను, వైద్యాధికారులను సమన్వయం చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి ఆరా

బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోమవారం ఫోన్లో ఽఅదికారులతో మాటాడారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.మృతి చెందిన చిన్నారి పురుషోత్తం, విద్యార్థిని యశ్వితశ్రీ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్న ఆయన ప్రమాదంలో గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తప్పిన పెనుప్రమాదం

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో పెద్ద ప్రమాదమే తప్పింది.ఆర్టీసీ బస్సు పుల్లంపేట సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా రాంగ్‌రూట్‌లో వస్తున్న లారీని గమనించిన బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో పక్కకు తిప్పాడు. అయినా కూడా లారీ డ్రైవర్‌ వైపు బలంగా ఢీకొంటూ దూసుకుపోయింది. లారీ బలంగా ఢీకొనడంతో బస్సు రోడ్డుపక్కన ఉన్న 11కేవీ విద్యుత్‌లైను స్తంభానికి తగిలి ముందుకు వెళ్లింది. ఏమాత్రం స్తంభాన్ని ఢీకొట్టి ఉన్నా 11కేవీ విద్యుత్‌లైను బస్సుపై పడి పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేది.

ట్రిపుల్‌ ఐటీలో కౌన్సెలింగ్‌కి వెళుతూ...

శ్రీకాళహస్తికి చెందిన స్వరూప, దినకర్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.చిన్నకుమార్తె యశ్వితశ్రీ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైంది. సోమవారం కౌన్సెలింగ్‌ ఉండడంతో తల్లిదండ్రులతో పాటు యశ్వితశ్రీ, ఆమె సోదరి రమ్యశ్రీ తిరుపతిలో బస్సెక్కారు.ప్రమాదంలో యశ్వితశ్రీ మృతిచెందగా రమ్యశ్రీ తీవ్రంగా గాయపడింది.ఆమె తండ్రి దినకర్‌ కూడా గాయపడ్డాడు.

తిరుమలకు వచ్చి వెళ్తుండగా...

తన చెల్లెలి కుమారుడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమానికి నెల్లూరుకు చెందిన కావల ప్రసన్న, వెంకటయ్య దంపతులు తమ 10 నెలల కుమారుడు పురుషోత్తాన్ని తీసుకొని తిరుమలకు వచ్చారు. అక్కడ బంధువులంతా కలిసి కార్యక్రమం ముగించుకుని కొంతమంది కారులో బయల్దేరారు.రాజంపేట వెళ్లేందుకు కొంతమంది బస్సెక్కారు.వీరిలో ప్రసన్న తీవ్రంగా గాయపడగా కుమారుడు పురుషోత్తం మృతిచెందాడు. ప్రసన్న తల్లి సుభాషిణి స్వల్పంగా గాయపడగా సోదరి జ్ఞానేశ్వరి తీవ్రంగా గాయపడింది.

మొక్కు తీర్చుకునేందుకు....

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కె.పవన్‌ ఇటీవల జరిగిన డీఎస్సీలో ఉద్యోగం సంపాదించాడు. మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో ఒక చేయి పూర్తిగా తెగిపోయింది.

ఇడుపులపాయకు వెళుతూ....

సత్యవేడు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి):బస్సు ప్రమాదంలో సత్యవేడు మండలం మాధనపాళేనికి చెందిన విద్యార్థిని ఆర్‌.తేజస్వినికి తీవ్ర గాయాలయ్యాయి.ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌కు తల్లిదండ్రులతో వెళుతున్న ఆమెకు ఈ ప్రమాదంలో రెండు చేతి వేళ్లు తెగిపోగా, కాలికి తీవ్ర గాయమైంది.ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె తల్లిదండ్రులు కూడా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.గాయాలు చేసిన బాధ కన్నా కౌన్సిలింగ్‌కు వెళ్ళలేకపోయానని తేజస్విని విలపిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టిస్తోంది.తేజస్విని ప్రతిభకు ప్రమాదం శాపంగా మారకుండా ఆమెకు న్యాయం కలిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి కౌన్సిలింగ్‌కు హాజరు కాలేకపోయినా తేజస్వినికి నేరుగా కౌన్సిలింగ్‌ లేకనే సీటు ఇవ్వాలని దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:42 AM