Share News

రుయాలో డైట్‌ కాంట్రాక్టు టెండర్లపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

ABN , Publish Date - May 07 , 2026 | 01:43 AM

తిరుపతిలోని రుయా జనరల్‌ ఆస్పత్రిలో డైట్‌ కాంట్రాక్టు టెండర్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. టెండర్ల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఓ కాంట్రాక్టరు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు.

రుయాలో డైట్‌ కాంట్రాక్టు టెండర్లపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

నిబంధనలు ఉల్లంఘించారంటూ ఓ కాంట్రాక్టర్‌ ఆరోపణ

చట్ట ప్రకారం టెండర్లు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు

తిరుపతి, మే 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రుయా జనరల్‌ ఆస్పత్రిలో డైట్‌ కాంట్రాక్టు టెండర్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. టెండర్ల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఓ కాంట్రాక్టరు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చట్టప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలిలా వున్నాయి.

తిరుపతిలోని రుయా, మెటర్నటీ ఆస్పత్రుల్లో రోగులకు ప్రభుత్వమే మూడు పూటలా ఆహారం అందజేస్తుంది. దాని కోసం టెండర్లు పిలిచి అర్హత కలిగిన డైట్‌ సప్లై కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రుయా ఆస్పత్రిలో డైట్‌ కాంట్రాక్టు కోసం గత నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేశారు. బిడ్‌లు దాఖలు చేయడానికి గత నెల 25 చివరి తేది. కాంట్రాక్టర్లు టెండరు నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు వంటివి ఆ తేదీ లోపే సమర్పించాల్సి వుంటుంది. గత నెల 30వ తేదీన టెండర్లు ఓపెన్‌ చేసి టెక్నికల్‌ ఎవాల్యుయేషన్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ టెండర్లు నిర్వహించే కమిటీకి జాయింట్‌ కలెక్టర్‌ను ఛైర్మన్‌గా నియమించారు. గత నెల 30న టెండర్లు తెరిచి పరిశీలించే క్రమంలో జీఎస్టీ సర్టిఫికెట్‌ సమర్పించని ఓ కాంట్రాక్టరును డిస్‌ క్వాలిఫై చేయలేదని.... ఆ కాంట్రాక్టరును అర్హుల జాబితాలో చేర్చడంతో పాటు జీఎస్టీ సర్టిఫికెట్‌ను సమర్పించడానికి అదనంగా గడువు ఇచ్చారని ఆరోపిస్తూ మెస్సర్స్‌ కె.బీరాన్‌ కుట్టి అనే కాంట్రాక్టు సంస్థ ఈనెల 1వ తేదీన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. టెండర్లు నిర్వహించిన అధికారులు నిబంధనలు సక్రమంగా పాటించలేదని, జీఎస్టీ సర్టిఫికెట్‌ సమర్పించని కాంట్రాక్టరును డిస్‌క్వాలిఫై చేయకుండా అర్హుల జాబితాలో చేర్చారని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈనెల 4వ తేదీన రిట్‌ పిటిషన్‌ (నంబరు 12778-2026)ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలూ విన్న హైకోర్టు టెండర్ల నిర్వహణ సందర్భంగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు పిటిషనర్‌ తగిన ఆధారాలేవీ చూపలేదని పేర్కొంది. దానికి తోడు ఇప్పటి వరకూ టెండరును ఖరారు చేసి ఎవరికీ కాంట్రాక్టు ఇవ్వలేదని జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను కూడా పరిగణనలోకి తీసుకుంది. అయినప్పటికీ చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. టెండర్ల ఖరారుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీసుకునే ఏ నిర్ణయమైనా న్యాయస్థానం జారీ చేసే తుది తీర్పుకు లోబడే వుంటుందని స్పష్టం చేసింది. వేసవి సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కాగా హైకోర్టు ఆదేశాల ప్రతిని మెస్సర్స్‌ బీరాన్‌ కుట్టి డైట్‌ కాంట్రాక్టు సంస్థ జిల్లా యంత్రాంగానికి అందజేసింది. నిబందనల ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థించింది.

Updated Date - May 07 , 2026 | 01:43 AM