Share News

మీ పిల్లలకైతే ఇలాంటి తిండి పెడతారా?

ABN , Publish Date - Jul 08 , 2026 | 01:20 AM

అధికారులపై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు ఆగ్రహం వాల్మీకిపురం, పీలేరులో తనిఖీలు

మీ పిల్లలకైతే ఇలాంటి తిండి పెడతారా?
వాల్మీకిపురం అంబేడ్కర్‌ గురుకులంలో అధికారులను నిలదీస్తున్న రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు దేవి

వాల్మీకిపురం/పీలేరు రూరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు చదువుతూ ఉంటారు.. వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు.. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనమే పెడతారా’ అంటూ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు గంజిమాల దేవి అధికారులపై మండిపడ్డారు. మంగళవారం ఆమె వాల్మీకిపురం, పీలేరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వాల్మీకిపురం పీవీసీ ఉన్నత పాఠశాల, ఇందిరమ్మ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను, పీలేరు పట్టణం తిరుపతి మార్గంలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాల, మదనపల్లె మార్గంలోని ఎస్టీ గురుకులం, ఎస్సీ, బీసీ బాలికల హాస్టళ్లను తనిఖీ చేశారు. వాల్మీకిపురం జగనన్న కాలనీ సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో పురుగులు పట్టిన రాగిపిండి, కాలం చెల్లిన గోధుమపిండి, నూనె, కుళ్లిన అరటిపండ్లు, కూరగాయలు, నాణ్యత, పరిమాణం లేని గుడ్లు బయటపడ్డాయి. దీంతో ఇలాంటి ఆహార పదార్థాలను పిల్లలకు పెడతారా అంటూ నిలదీశారు. మెను పాటించకపోవడంతో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కు ఫోన్‌చేసి బాధ్యతగా నడుచుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నిత్యావసర సరుకులు కొనేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌, డీసీడీవోబీ సుమతి, ఎంఈవోలు, డీఎ్‌సవో చంద్రకళ, డీవీఎం సుజాత, పీలేరు ఎంఈవోలు బాబునాయక్‌, పద్మావతి ఆమె వెంట ఉన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 01:20 AM