పనులు చకచకా..!
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:23 AM
సీఎం చంద్రబాబునాయుడు ఈనెల 18వ తేదీన మదనపల్లెకు రానున్నారు. జలధార పథకం పరిశీలనతో పాటు మదనపల్లె కేంద్రంగా రాయలసీమకు రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
- 18న మదనపల్లెకు సీఎం రాక
- ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ
- ప్రజావేదిక, పొలిటికల్, రైతు వేదిక ఏర్పాటు
మదనపల్లె, జూలై15(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు ఈనెల 18వ తేదీన మదనపల్లెకు రానున్నారు. జలధార పథకం పరిశీలనతో పాటు మదనపల్లె కేంద్రంగా రాయలసీమకు రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రాక సందర్భంగా మదనపల్లె, మండలంలోని బెంగళూరు రోడ్డు వెంబడి చీకిలబైలు వరకూ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గతనెల 20న సీఎం పర్యటన ఉండగా అప్పటికే అధికారులు సగానికిపైగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో రద్దయింది. తిరిగి నెలరోజుల తర్వాత శనివారం పట్టణానికి రానున్నారు. ఇందుకు గాను ఆయా శాఖల అధికారులు నిర్ణీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. బెంగళూరు రోడ్డులోని బిస్కెట్ల ఫ్యాక్టరీ ముందు ప్రజావేదిక, బార్లపల్లె వద్ద రాజకీయ వేదిక, వెంకటమ్మచెరువు వద్ద రైతులతో ముఖాముఖికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మొదటగా బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో స్థానిక బి.టి.కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ మూడు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు నక్కలదిన్నె నుంచి చీకిలబైలు వరకూ గతుకుల రోడ్డుకు అతుకులు వేస్తున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్డుకు తారురోడ్డు రెన్యువల్ చేస్తున్నారు.ఈరోడ్డు వెంబడి ఇబ్బడిముబ్బడిగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను ఇప్పటికే తొలగించగా, అడ్డుగా ఉన్న చెట్లు తొలగిస్తున్నారు. కిందకు ఉన్న విద్యుత్తు లైన్ల మార్పుతోపాటు రాజకీయ సమావేశ వేదికకు కొత్తగా విద్యుత్తు లైన్‌తోపాటు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.
చెరువుల పరిశీలన..రైతులతో ముఖాముఖి
హెలిప్యాడ్ నుంచి అన్నీ ఒకే రూట్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. మొదట ప్రజావేదిక బహిరంగ సభ, తర్వాత కొంత దూరంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం, ఆ తర్వాత చీకిలబైలు సమీపంలోని కదిరమ్మ, వెంకటమ్మ చెరువులను సీఎం పరిశీలించనున్నారు. జలధార కార్యక్రమంలో భాగంగా ఈ చెరువుల కింద లబ్ధి పొందిన రైతులతో ముఖాముఖిగా మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా హెలిప్యాడ్ నుంచి పది కి.మి.మేర సీఎం పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. వీటిని కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్, జేసీ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి పర్యవేక్షిస్తుండగా, రాయచోటి, పీలేరు ఆర్డీవోలు, ఆయా తహసీల్దార్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.