ఆర్థిక స్వేచ్ఛ.. ఆరోగ్యం.. ఆనందంతోనే మహిళా సాధికారత
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:00 AM
ఆర్థిక స్వేచ్ఛ.. ఆరోగ్యం.. ఆనందంతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక స్వేచ్ఛ.. ఆరోగ్యం.. ఆనందంతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 10 వేలకుపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తయారయ్యారని వెల్లడించారు. డ్వాక్రా సంఘాలకు 11 నెలల్లో సుమారు రూ.2,600 కోట్లకుపైగా రుణాలు అందించామన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రతి నెలా సుమారు 28లక్షలమంది సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత వైద్య సేవలు, టీకాలు అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. నగరపాలక కమిషనర్ మౌర్య మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తేనే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర డైరెక్టర్ కుమారి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ స్రవంతి తదితరులు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీడియో ద్వారా వీక్షించారు. అనంతరం డ్వాక్రా సంఘాలకు, ఎస్సీ మహిళలకు రుణాలకు సంబంధించిన మెగా చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. అలాగే వర్సిటీ ఆవరణంలో డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఐసీడీఎస్, విద్యాశాఖ, పోలీసు తదితర శాఖల మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.