Share News

అటవీ ప్రాంతంలో మహిళ హత్య?

ABN , Publish Date - Jul 14 , 2026 | 02:05 AM

చంద్రగిరి మండలం, మూలపల్లె అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరి హత్యకు గురైంది.పశువుల యజమానే ఈ హత్య చేసి ఆనవాళ్లను చెరిపేసి దహన క్రియలకు సిద్ధమయ్యారన్న ఆరోపణలున్నాయి.

అటవీ ప్రాంతంలో  మహిళ హత్య?
కుమారి ముఖంపై రక్త గాయాలు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

చంద్రగిరి, జూలై 13(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం, మూలపల్లె అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరి హత్యకు గురైంది.పశువుల యజమానే ఈ హత్య చేసి ఆనవాళ్లను చెరిపేసి దహన క్రియలకు సిద్ధమయ్యారన్న ఆరోపణలున్నాయి.మండపంపల్లెకు చెందిన చెంగల్రాయులురెడ్డికి సుమారు 50 పశువులున్నాయి. ఈ పశువులను మూలపల్లె అటవీ ప్రాంతంలో పోషణకోసం పెట్టి, అక్కడ మూలపల్లెకు చెందిన దంపతులు రాజేంద్ర, కుమారి(36)లను మూడేళ్ల క్రితం కాపలాదారులుగా నియమించాడు. వీరక్కడే జీవనం సాగిస్తున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం ఉదయం కుమారి మృతి చెందిందని చెంగల్రాయులుకు సమాచారం అందడంతో మూలపల్లె అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని చూసి, గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పులిచెర్ల మండలం, మంగళంపేట సమీపంలో ఉంటున్న కుమారి పెద్ద కుమార్తె కృష్ణవేణికి ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొందని సమాచారమిచ్చాడు. అంతేకాకుండా మంగళంపేటలోనే దహన క్రియలు నిర్వహించుకోవడానికి అక్కడినుంచి బంధువులను తీసుకురమ్మన్నాడు. కుమార్తె రాకముందే దుప్పటిపై పురుగుల మందు పోసి, వాళ్లను నమ్మబలికించాడు.కుమార్తె రాకముందే రాజేంద్ర అక్కడినుంచి పరారయ్యాడు. అనంతరం కుమారి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకొని అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గానికి తీసుకొస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఎదురుపడ్డారు. మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారని ప్రశ్నించడంతో మంగళంపేటకు పశువుల యజమాని తీసుకెళ్లమన్నాడని కుమార్తె తెలిపింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ముఖం, మెడ, చేతిపై రక్త గాయాలు ఉండటంతో, అటవీ ప్రాంతంలో కుమారి, రాజేంద్ర నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ రక్తపు మరకలుండటంతో క్లూస్‌ టీమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది...?

భార్యాభర్తలైన కుమారి, రాజేంద్రలకు మద్యం అలవాటు ఉన్నట్లు సమాచారం. పశువుల యజమాని చెంగల్రాయులు వారికి మద్యం బాటిళ్లు తీసుకెళ్లి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో భార్యాభర్తలు మద్యం తాగి గొడవ పడడం, ఈ సందర్భంగా భర్త ఆమెపై దాడి చేయడంతో కుమారి మృతి చెంది ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి శరీరంపై తీవ్ర రక్త గాయాలు ఉన్నా, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులకు పోలీసులకు, సమాచారం ఇవ్వడం, కుటుంబ సభ్యులు రాకముందే రాజేంద్ర అక్కడ నుంచి పరారవ్వడం, పశువుల యజమాని కుమారి మృతి చెందిన చోట సాక్ష్యాధారాలను తారుమారు చేసి, దుప్పటిపై పురుగుల మందు పోసి, హత్యను ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాడనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 02:05 AM