సమస్య పరిష్కరించకనే....!
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:31 AM
పరిష్కరించేసినట్లు సమాధానాలు
పిచ్చాటూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సమస్య పరిష్కరించకనే పరిష్కరించినట్లు సమాధానాలు ఇస్తారా అంటూ 70యేళ్ల వృద్ధురాలు ప్రజా వేదిక సమావేశంలో రెవెన్యూ అధికారుల ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు గ్రామానికి చెందిన ఆర్.దమయంతికి సర్వే నెం.90-5లో 0.13 సెంట్ల పట్టా భూమి వుంది. దాని పక్కనే ఉన్న 20 సెంట్ల భూమికి పోయే దారికి అడ్డంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఆర్టీసీ డ్రైవర్ డేవిడ్ రాజ్ గ్రామనత్తం భూమిలో ఇల్లు నిర్మించుకోవడంతో పాటు ప్రహరీ గోడ నిర్మించాడు. దీంతో తన స్థలానికి పోయే దారి కావాలంటూ దమయంతి 2024 జూన్ 13న నిర్వహించిన తొలి ప్రజావేదికతో పాటు 2024 జూలై 29న నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రాలు అందించారు. అలాగే మంత్రి నారా లోకేశ్ సత్యవేడు పర్యటనలో 2025 మే 8న వినతిపత్రం అందజేశారు. మండలంలో జరిగిన మూడు పీజీఆర్‌ఎస్‌లలో అర్జీ పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. అయితే సమస్య పరిష్కరించినట్లు, అందుకు అంగీకరించినట్లు దమయంతి సంతకం ఫోర్జరీ చేసి ఎండార్స్‌మెంట్ కాపీని అదికారులు అందించారు. మరోసారి 16 అడుగుల మేర దారి ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో సమాధానం ఇచ్చారు.ఇటీవల ఇంకో ఎండార్స్‌మెంట్ కాపీలో క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆ భూమికి ఇదే దారి కాకుండా వేరే మార్గంలో కూడా దారి ఉందని సమాధానం ఇచ్చారు. సెప్టెంబరు 20 తరువాత గ్రామానికి వచ్చి క్షేత్ర స్థాయిలో విచారించి పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. ఇలా ఎన్ని రకాల సమాధానాలిస్తారని ఆమె వాపోయారు.