48 గంటల్లో..
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:28 AM
ఇద్దరు బాలికల అదృశ్యం కేసును చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇన్‌స్టాలో పరిచయమైన వారితో కలిసి టూర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇద్దరు బాలికల అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు
‘ఇన్‌స్టా’లో పరిచయమైన వారితో కలిసి టూర్‌కు వెళ్లిన వైనం
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు బాలికల అదృశ్యం కేసును చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇన్‌స్టాలో పరిచయమైన వారితో కలిసి టూర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు నగరానికి చెందిన ఇద్దరు బాలికలు కనిపించడం లేదని ఈ నెల 14వ తేది వారి తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాపులో భాగంగా ఆ బాలికలు వినియోగించిన సోషల్ మీడియా అకౌంట్‌ను.. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. వారు గుంటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఆయా జిల్లాల పోలీసులను సమన్వయం చేసుకుని గురువారం ఆ ఇద్దరు బాలికలను సురక్షితంగా చిత్తూరుకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇన్‌స్టా ద్వారా పరిచయమైన వ్యక్తులతో కలిసి టూర్‌కు వెళ్లాలని భావించామని, ఈ విషయాన్ని ఇంట్లో చెబితే ఒప్పుకోరని చెప్పకుండా వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో ఆ బాలికలు చెప్పారు.
సోషల్ మీడియాతో ప్రమాదం?
14 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల నియంత్రణ విధించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండేలా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. ఇలాంటి సంఘటనల్లో కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా ముఠా లేదా ఇతర నేరగాళ్లు ఉండే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పిల్లలు ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నట్లయితే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి ఆలోచలను, పరిచయాలను తెలుసుకోవాలన్నారు.