Share News

హైస్కూల్‌ ప్లస్‌ 2 విధానంతో.. ఫలితాలేవీ?

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:33 AM

ఇంకా వైసీపీ పోకడల్లోనే ఇంటర్‌ తరగతులు బేజారవుతున్న విద్యార్థులు

హైస్కూల్‌ ప్లస్‌ 2 విధానంతో.. ఫలితాలేవీ?
ఇంటర్‌ తరగతులు బోధించే మదనపల్లె జడ్పీ హైస్కూల్‌ ప్లస్‌ 2 భవనాలు

మదనపల్లె టౌన్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు హైస్కూల్‌ వాతావరణం వీడి జోషుగా జూనియర్‌ ఇంటర్‌లో చేరాలని ఆశపడుతుంటారు. గత వైసీపీ పాలకులు ప్రవేశపెట్టిన హైస్కూల్‌ ప్లస్‌ 2 విధానంతో మంచి ఫలితాలు రాకపోగా నిరాశతో బేజారు పడుతున్నారు. వైసీపీ పాలనలో 2022వ సంవత్సరంలో హైస్కూల్‌ ప్లస్‌ 2 విధానంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కాకుండా, ఆయా హైస్కూళ్లలోనే ఇంటర్‌ తరగతుల బోధన విధానం ప్రవేశపెట్టారు. జిల్లాలో రాజంపేట, సుండుపల్లె, గాలివీడు, నందలూరు, రైల్వేకోడూరు, వాల్మీకిపురం, చిట్వేల్‌, మదనపల్లెలోని జడ్పీ హైస్కూళ్లకు అనుసంధానంగా హైస్కూల్‌ ప్లస్‌ 2 విద్యావిధానం ప్రవేశపెట్టారు. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఇక్కడ చేరే విద్యార్థులకు 11 సబ్జెక్టులను బోధించేందుకు హైస్కూల్లో టెన్త్‌ తరగతులు బోధించే ఉపాఽధ్యాయుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారిని పురమాయించారు. వీరికి జీతంతోపాటు రూ.2వేలు ఇంక్రిమెంట్లు ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు.

నిరాశపరుస్తున్న ఫలితాలు

వైసీపీ పాలకులు ప్రవేశపెట్టిన హైస్కూల్‌ ప్లస్‌ 2 విద్యావిధానం సత్ఫలితాలు ఇవ్వలేదనటానికి నాలుగేళ్లుగా వెలువడిన ఇంటర్‌ ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. 2022-23వ సంవత్సరంలో హైస్కూల్‌ ప్లస్‌ 2 ఫలితాల్లో జిల్లాలో 15శాతం, 2024లో 19శాతం, 2025లో 14.28 శాతం, తాజాగా 2026లో 14శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. దీన్నిబట్టి చూస్తే జూనియర్‌ కళాశాలల్లో బోధనలు విన్న విద్యార్థులు సరాసరిన 59శాతం ఉత్తీర్ణులవుతుంటే హైస్కూల్‌ ప్లస్‌ 2 విద్యార్థులు సరాసరిన 14శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఈ విద్యావిధానం వల్ల విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం జిల్లా ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో 26 స్థానం(చివరి)లో నిలబడటానికి ఇదో కారణంగా చెప్పవచ్చు. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

సామర్థ్యానికి అనుగుణంగా విద్యా బోధన

హైస్కూల్‌ ప్లస్‌ 2, ఇంటర్‌ ఫలితాల్లో ఈ ఏడాది చివరి స్థానంలో నిలవడంపై డీఐఈవో రవి మాట్లాడుతూ పరీక్షలు రాజీ లేకుండా స్ట్రిక్ట్‌గా నిర్వహించామన్నారు. వచ్చే ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తామని తెలిపారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన చేస్తామని పేర్కొన్నారు. తొలి నాలుగు నెలల్లో ఇంటర్‌ ఫౌండేషన్‌ కోర్సులతో విద్యార్థులు రాణించేలా బోధనలు అందిస్తామని వివరించారు.

Updated Date - Apr 18 , 2026 | 01:33 AM