Share News

గాలి వాన బీభత్సం

ABN , Publish Date - May 05 , 2026 | 12:26 AM

ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది.

గాలి వాన బీభత్సం
పలమనేరు-కుప్పం జాతీయరహదారిపై జీడిగుట్ల వద్ద విరిగిపడిన చెట్లు - యాదమరి మండలం దాసరాపల్లెలో నేలరాలిన మామిడి కాయలు

రామకుప్పం, మే 5(ఆంధ్రజ్యోతి): ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. భారీగాలులు, వడగండ్లతో కూడిన వాన కురిసింది. వడగండ్లతో బెంబేలెత్తిన జనం రక్షణ కోసం పరుగులు తీశారు. గాలులకు రామకుప్పం పరిసర మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. టమోటా, బీన్స్‌, బంగాళదుంప తోటల్లో నీరు చేరాయి. వడగండ్ల వల్ల టమోటా, బీన్స్‌, బంగాళదుంపలతో పాటు అరటి కాయలు దెబ్బతిని నష్టాన్ని కలిగించాయని రైతులు వాపోయారు. పట్టణ శివార్లు, రాజుపేట సమీపాన తీగలపై చెట్ల కొమ్మలు పడటంతో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. బందార్లపల్లె పంచాయతీ బోయనపల్లెచేన్లు వద్ద మూడు స్తంభాలు నెలకొరిగాయి. పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. రెస్కో సిబ్బంది శ్రమించి రాత్రి 7గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. నెలన్నర రోజులుగా మండుటెండలతో తీవ్ర ఉక్కపోతకు గురైన జనం ఈ వర్షంతో ఊరట చెందారు. సాయంత్రం 6గంటల నుంచి తిరిగి ప్రారంభమైన వర్షం విడతల వారీగా కురుస్తూనే ఉంది. ఇక, వి.కోటతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున, సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో టమోటా, బీన్స్‌, బంగాళదుంప, పూల తోటల్లో వర్షపునీరు నిలిచింది. దీంతో పంటలు దెబ్బతింటాయన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. పలమనేరులోనూ సోమవారం సాయంత్రం 6 నుంచి అరగంట పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిండ్ర మండలంలో ఆదివారం మధ్యాహ్నం పెనుగాలులు, వర్షం పడింది. కావనూరులో సుమారు 22 స్తంభాలు నేలకొరిగాయి. విజయపురం మండలంలో ఆదివారం సాయంత్రం గాలి వాన బీభత్సానికి మామిడి కాయలు రాలిపోయాయి. నారపరాజుకండ్రిగలో రైతులకు ఎక్కువ నష్టం కలిగింది.

Updated Date - May 05 , 2026 | 12:27 AM