Share News

నెయ్యిలో కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తారా?

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:25 AM

కల్తీ జరగలేదని చెప్పటానికి వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉందా అని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సవాల్‌ విసిరారు.

నెయ్యిలో కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తారా?

తిరుపతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని శ్రీవారి పాదాల చెంతైనా, కాణిపాకం దగ్గరకైనా వచ్చి ప్రమాణం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ కల్తీ జరగలేదని చెప్పటానికి వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉందా అని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సవాల్‌ విసిరారు.తిరుపతిలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిన విషయం హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టంగా వెల్లడైందని, అది నెయ్యే కాదని సింథటిక్‌ ఘీ అని ఆమె గుర్తు చేశారు. ఈ నివేదికలోని వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నంలో వైసీపీ నాయకులు కల్తీ జరగలేదని అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శకతతో నిజాలను ప్రజల ముందుకు తీసుకొస్తోందని, భక్తుల విశ్వాసాన్ని కాపాడడమే తమ లక్ష్యమని అన్నారు. సీఎంపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి దివాకర రెడ్డి, ఏపీజీబీసీ చైర్మన్‌ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సీఎం చంద్రబాబు దూరదృష్టి, ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన బడ్జెట్‌ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సదాశివం, జోనల్‌ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, నాయకులు ఊకా విజయకుమార్‌, జేబీ శ్రీనివాసులు, గంగమ్మ గుడి చైర్మన్‌ మహేష్‌ యాదవ్‌, ఎస్సీసెల్‌ డైరెక్టర్‌ కుమారమ్మ, పార్లమెంటు కమిటీ నాయకులు యశ్వంత్‌ రెడ్డి, మునిరామయ్య, కందేరి కార్తీక్‌, సురేంద్ర నాయుడు, విజయకుమార్‌, రేవతమ్మ, చెంగయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:25 AM