Share News

- టెన్త్‌ ‘స్పాట్‌’లో ట్యాబ్‌లు కొనసాగిస్తారా?

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:19 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ (మూల్యాంకనం) ప్రక్రియలో రెండో రోజైన మంగళవారం సాంకేతిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

- టెన్త్‌ ‘స్పాట్‌’లో  ట్యాబ్‌లు కొనసాగిస్తారా?
సర్దుబాట్లపై సిబ్బందితో చర్చిస్తున్న డీఈవో రాజేంద్రప్రసాద్‌

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ (మూల్యాంకనం) ప్రక్రియలో రెండో రోజైన మంగళవారం సాంకేతిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో మూల్యాంకనం తర్వాత మార్కుల నమోదుకు ట్యాబ్‌లనే కొనసాగిస్తారా? లేదా పాత పద్ధతిలాగే ఓఎంఆర్‌ షీట్‌కు వెళతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు సాగినా, సాంకేతిక లోపం, నెట్‌ వర్క్‌ పనిచేయకపోవడం, సర్వర్‌ డౌన్‌, ట్యాబ్‌లు సజావుగా పనిచేయకపోవడం వంటి కారణాలతో మార్కుల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. తొలి రోజున ఒక్కో టీచర్‌ కేవలం 20 జవాబు పత్రాలే మూల్యాంకనం చేశారు. అనంతరం వాటిని స్కాన్‌ చేసి, ట్యాబ్‌లో నమోదుకు సాంకేతిక విభాగం పూర్తిగా విఫలమైంది. గత రాత్రి మిగిలిన మార్కుల నమోదు ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నానికి కానీ పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం ఒక్కో టీచర్‌ కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ప్రతి జవాబు పత్రాన్ని స్కానింగ్‌ చేయడంతో పాటు మార్కులు నమోదు చేయాలి. ట్యాబ్‌ల ప్రక్రియను కేటాయించిన స్పెషల్‌ అసిస్టెంట్లు మాత్రమే చేయాలి. సమస్య వచ్చిందని, మరో స్పెషల్‌ అసిస్టెంట్‌ చేయాలని ప్రయత్నించినా, అందుకు సాఫ్ట్‌వేర్‌ అనుమతించదు. దీంతో ఏం చేయాలో తెలియక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

‘స్పాట్‌’ విధులకు పలువురి డుమ్మా

మరో వైపు జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే అసిస్టెంట్‌ ఎగ్జామినర్ల కొరత అధికారులను పీడిస్తోంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్‌ విధులు కేటాయించినా, టీచర్లు వాటిని లెక్క చేయకపోవడంతో పాటు స్పాట్‌ నుంచి మినహాయింపుల కోసం ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఈ చర్యలతో మూల్యాంకనం ప్రక్రియ విద్యాశాఖ అధికారులకు గుదిబండగా మారింది. మంగళవారం తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టులకు మూల్యాంకనం చేయడానికి టీచర్ల కొరత ఎక్కువగా కనిపించింది. మరో వైపు మైనర్‌ మీడియం (సంస్కృతం, తమిళం) వంటి సబ్జెక్టులు మూల్యాంకనం చేయడానికి టీచర్లు స్పాట్‌ సెంటర్‌లో హాజరైనా, వారికి రాష్ట్ర స్థాయి నుంచి ఐడీలు క్రియేట్‌ కాలేదు. దీంతో ఆ జవాబు పత్రాల మూల్యాంకనం మరింత ఆలస్యం కానుంది. ఈ క్రమంలో స్పాట్‌ విధులకు హాజరైన తనకు లీఫ్‌ యాప్‌లో ఆర్డర్‌ జనరేట్‌ కాలేదని డీఈవోను ఓ మహిళా టీచర్‌ అడిగారు. అదే సమయంలో అక్కడున్న విద్యాశాఖలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ అధికారి ఆ మహిళా టీచర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. స్పాట్‌లో టీచర్ల కొరత తీవ్రతరం కావడంపై డీఈవో రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. స్పాట్‌ విధులకు హాజరుకాని టీచర్లపై సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు. మరో వైపు సెంటర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను టెలికం అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:19 AM