వారసుల భూములు ‘పట్టాలు’ ఎక్కేనా?
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:31 AM
శెట్టిపల్లె భూ వివాదం పరిష్కారమైనా తమకు మాత్రం అన్యాయం జరుగుతోందని వారసత్వ బాధితులు ఆవేదన వక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లె భూముల సమస్య పరిష్కారంలో తుడా చైర్మన్ దివాకరరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు చొరవ తీసుకున్న విషయం తెలిసిందే.
తుడాలో ముందుకు కదలని శెట్టిపల్లె ఫైళ్లు
తిరుపతి సెంట్రల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): శెట్టిపల్లె భూ వివాదం పరిష్కారమైనా తమకు మాత్రం అన్యాయం జరుగుతోందని వారసత్వ బాధితులు ఆవేదన వక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లె భూముల సమస్య పరిష్కారంలో తుడా చైర్మన్ దివాకరరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆగమేఘాలపై ఈ సమస్యను గట్టెక్కించారు.శెట్టిపల్లెలోని 2111మంది లబ్ధిదారుల్లో 1850 మందికి డాక్యుమెంట్లు అందజేశారు.అయితే లబ్ధిదారుల్లో మృతి చెందిన సుమారు 120మంది కుటుంబీకులకు వారసత్వ హక్కు కింద పట్టాలు అందజేయడంలో జాప్యం జరిగింది.వీరిలో కూడా 50మందికి ఇటీవల పట్టాలు అందజేశారు. మిగిలిన 70మందికి సంబంధించిన పైళ్లు సిద్ధం చేసి భూమి రిజిస్ర్టేషన్ చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జేసీ తుడా భూ సేకరణ అధికారులను ఆదేశించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భాల్లో చట్టబద్ధ వారసుల పేర్లు నమోదు చేయడంలో అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని తెలిసింది. ఒక విభాగం ఇచ్చిన పత్రాలను మరో విభాగం తిరస్కరిస్తోందని బాధితులు వాపోతున్నారు. భూసేకరణ విభాగంలో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది తలోరీతిన వ్యవహరిస్తుండడంతో రిజిస్ర్టేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై తుడా వీసీ గోవిందరావును అడగ్గా పట్టాలు పొందడానికి అర్హత కలిగిన వారసత్వ హక్కుదారులకు త్వరలోనే రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.ఆర్డీవో కార్యాలయం నుంచి అవసరమైన మేరకు పైళ్లు వచ్చాయని,ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.