Share News

శ్రీకాళహస్తి ఆస్పత్రికి జిల్లాస్థాయి హోదా దక్కేనా?

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:40 PM

జిల్లాల పునర్విభజన జరిగి నాలుగేళ్లవుతోంది. తిరుపతి కేంద్రంగా జిల్లా ఆవిర్భవించినా జిల్లా ఆస్పత్రి ఏర్పాటు కాలేదు.

శ్రీకాళహస్తి ఆస్పత్రికి జిల్లాస్థాయి హోదా దక్కేనా?
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి భవనం

జిల్లాల పునర్విభజన జరిగి నాలుగేళ్లవుతోంది. తిరుపతి కేంద్రంగా జిల్లా ఆవిర్భవించినా జిల్లా ఆస్పత్రి ఏర్పాటు కాలేదు. తిరుపతిలో రుయా వంటి పెద్దాస్పత్రి ఉండటం కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీకాళహస్తికి జిల్లా స్థాయి హోదా దక్కుతుందని ఈ ప్రాంతవాసులు ఆశిస్తున్నారు.

- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తిరుపతిలో రుయా, చిత్తూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉండేవి. 2022లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలను పునర్విభజించింది. అప్పటివరకూ ఉన్న జిల్లా ఆస్పత్రి చిత్తూరు పరిధిలోకి వెళ్లిపోయింది. మదనపల్లె ఆస్పత్రి అన్నమయ్య జిల్లా పరిధిలో చేరింది. కొద్ది నెలల క్రితం కూటమి ప్రభుత్వం చేసిన మార్పుతో గూడూరు కూడా నెల్లూరు జిల్లాలో విలీనమైంది. దీంతో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో జిల్లా స్థాయి ఆస్పత్రి లేకుండా పోయింది. వంద పడకలతో ఉన్న శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రి స్థాయిని పెంచడం ద్వారా ఈ లోటును భర్తీ చేసే అవకాశముందనే వాదన తెరమీదకు వచ్చింది.

ప్రయోజనాలెన్నో..

శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా కల్పిస్తే తూర్పు ప్రాంతానికి చెందిన పది మండలాల ప్రజలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి రూపుదిద్దుకుంటే మూడింతల వైద్య సిబ్బంది పెరుగుతారు. ట్రామాకేర్‌ సెంటర్‌, బ్లడ్‌బ్యాంకు, 24 గంటలు నిరంతరం కాన్పుల సేవలు వంటివి ఏర్పాటవుతాయి. అంతేకాదు స్పెషాలిటీ బ్లాకులూ అందుబాటులోకి వస్తాయని ఇక్కడి కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు పెరిగే అవకాశం

50కిలోమీటర్ల పరిధిలో కొన్ని పీహెచ్‌సీలు 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల స్థాయికి అప్‌గ్రేడ్‌ అవుతాయి. ప్రస్తుతం తూర్పు మండలాల్లో కొన్నిచోట్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు కూడా లేవు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఏర్పేడు, రేణిగుంట, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం, తొట్టంబేడు మండలాల్లో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట ఆస్పత్రుల్లో పడకల సాయి పెరుగుతుంది.

ఏఆర్‌టీ సెంటర్‌ ఏర్పాటుపైనా కసరత్తు

ఏరియా ఆస్పత్రిలో ఎయిడ్స్‌ బాధితులకు ఐసీటీసీ కేంద్రం మాత్రమే ఉంది. ప్రాథమిక సేవలు మాత్రమే అందుతున్నాయి. 500 కన్నా ఎక్కువ హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు ఉంటే ఏఆర్‌టీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. నాలుగేళ్ల క్రితమే ఈ సంఖ్య దాటింది. తాజాగా ఇక్కడి ఏఆర్‌టీ సెంటర్‌ ఏర్పాటుపై కూడా కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం.

Updated Date - Mar 22 , 2026 | 11:40 PM