బొప్పాయి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తారా?
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:48 AM
బొప్పాయి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తారా? అంటూ దళారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఆదివారం రైల్వేకోడూరులో జరిగింది. లారీలు తోటల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
దళారులతో రైతుల వాగ్వాదం
తోటల్లోకి లారీలు వెళ్లకుండా అడ్డగింత
పోలీసుల రంగప్రవేశంతో సర్దుబాటు
రైల్వేకోడూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బొప్పాయి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తారా? అంటూ దళారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఆదివారం రైల్వేకోడూరులో జరిగింది. లారీలు తోటల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులొచ్చి సర్దుబాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. దళారులు రెండు వర్గాలుగా తయారయ్యారని మండిపడ్డారు. ఓ వర్గం టన్ను కాయలను రూ.17వేలకు, మరో వర్గం రూ.18వేలను కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. టన్ను రూ.18వేలను కొనుగోలు చేయాలన్న కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ అంతర్జాతీయ మార్కెట్‌లో బొప్పాయికి మంచి ధరలున్నా.. మార్వాడీ వ్యాపారులతో దళారులు కుమ్మక్కై ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం, మదనపల్లె తదితర ప్రాంతాల్లో బొప్పాయికి మంచి ధరలు ఉన్నాయని చెప్పారు. ఇకనైనా రైతులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం రూ.5 సబ్సిడీ ప్రకటించాలి: సీఐటీయూ
రాష్ట్ర ప్రభుత్వం కిలోకు బొప్పాయికి రూ.5 సబ్సిడీ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకుడు సీహెచ్ చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి డిమాండ్ చేశారు. ఆదివారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని నేతివారిపల్లెలో బొప్పాయి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా గుండయ్యయాదవ్, అధ్యక్షుడిగా సుగవాసి శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా యద్దల సుబ్బనరసింహులు, ఉపాధ్యక్షులుగా గరిక రామచంద్ర, దాదిరెడ్డి శివారెడ్డి, సహాయ కార్యదర్శిగా చౌదరిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు ఎంపికయ్యారు.
నేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ధరల నిలకడ కోసం సోమవారం రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బొప్పాయి రైతు సంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. నియోజకవర్గంలోని రైతులంతా పాల్గొనాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేవరకు పోరాటం ఆగదని తెలిపారు.