స్కిట్-జేఎన్టీయూలో తరగతులు జరిగేనా..?
ABN , Publish Date - May 11 , 2026 | 01:26 AM
గత ఏడాది 38కే పరిమితమైన అడ్మిషన్లు ఇక్కడి విద్యార్థులకు కలికిరిలో తరగతులు
శ్రీకాళహస్తి, మే 10 (ఆంధ్రజ్యోతి): స్కిట్ -జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం పోసింది. అప్పటికే తొలి విడత కౌన్సెలింగ్ ముగియడంతో విద్యార్థుల చేరిక సమయం దాటిపోయింది. కొందరు అడ్మిషన్లు పొందినప్పటికీ స్థానికంగా తరగతులు నిర్వహించ లేక అందరికీ కలికిరిలో చదువుకునే ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచైనా స్కిట్ జేఎన్టీయూలో తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. అధికారుల్లో మాత్రం ఇంకా చలనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
ఘనమైన చరిత్ర
శ్రీకాళహస్తిలో స్కిట్ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. సీఎం చంద్రబాబు సహకారంతో అప్పట్లో మంత్రిగా ఉన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కోసం ఎంతగానో కృషి చేశారు. ఎట్టకేలకు 1999వ సంవత్సరం ముక్కంటి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(స్కిట్) కళాశాలను ప్రతిష్టాత్మకంగా నెలకొల్పారు. మొదట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ అభ్యసించారు. గత వైసీపీ పాలనలో విద్యార్థుల చేరిక గణనీయంగా తగ్గిపోయింది. విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోవడంతో ముక్కంటి ఆలయ నిధులతో కళాశాల నిర్వహించలేమంటూ వైసీపీ పాలకులు, అధికారులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో 2021 డిసెంబరు నెల విద్యా సంవత్సరం మధ్యలోనే కళాశాలను మూసివేశారు. కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలా స్కిట్ కళాశాల ప్రస్థానం అప్పటికి అలా ముగిసింది.
ఇచ్చిన హామీ మేరకు..
తన తండ్రి స్థాపించిన కళాశాలను తిరిగి ఆరంభించి ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే స్కిట్ కళాశాలను తిరిగి ప్రారంభించారు. జేఎన్టీయూకు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం రెండో విడత కౌన్సెలింగ్‌లో స్కిట్ జేఎన్టీయూ పేరుతో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. అప్పటికే విద్యార్థులు కళాశాలలో చేరిపోవడంతో 38 మంది విద్యార్థులు మాత్రం స్కిట్లో అడ్మిషన్లు పొందారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో కలికిరి జేఎన్టీయూ కళాశాలలో ఒక సంవత్సరం స్కిట్ విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.
ఏడాదైనా కొరవడిన ప్రణాళిక
ఈనెల 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇంటర్ పరీక్షలు ఫలితాలు వెలువడక ముందు నుంచే పలు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులు విద్యార్థుల చేరిక కోసం వెంటపడుతున్నాయి. ఇప్పటివరకు స్కిట్ తరఫునుంచి ముందస్తు ప్రణాళికలు లేవు. ఈ ఏడాదైనా స్కిట్ కళాశాలలో తరగతుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.