Share News

భర్త చేతిలో భార్య హతం

ABN , Publish Date - Aug 30 , 2026 | 02:01 AM

భర్త చేతిలో భార్య హతమైన విషాదకర ఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని కొడవలితో నరికి హత్య చేశాడు.

భర్త చేతిలో భార్య హతం
రక్తపుమడుగులో దండామణి మృతదేహం

- కాపురానికి రాలేదని కొడవలితో నరికి హత్య

- నిందితుడు పాత నేరస్తుడు

మదనపల్లె క్రైం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): భర్త చేతిలో భార్య హతమైన విషాదకర ఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని కొడవలితో నరికి హత్య చేశాడు. డీఎస్పీ బుచ్చిరాజు వివరాల మేరకు.. తంబళ్లపల్లె మండలం బాలిరెడ్డిగారిపల్లె పంచాయతీ దిన్నెమీదపల్లెకు చెందిన కొండప్పగారి మధుకర్‌రెడ్డికి 20ఏళ్ల కిందట బి.కొత్తకోట మండలం బండమీద కొత్తపల్లెకు చెందిన దండామణి(38)తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో మధుకర్‌రెడ్డి గ్రామంలో బాంబులు వేయడంతో తంబళ్లపల్లె పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చి పీలేరు, అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో పలు దాడులు, హత్యాయత్నాలు, చోరీ, దోపిడీలకు పాల్పడటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఏటీఎం చోరీలకు పాల్పడటంతో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏటీఎం చోరీ కేసుల్లో కర్ణాటక న్యాయస్థానం మధుకర్‌రెడ్డికి పదేళ్లు జైలుశిక్ష విధించింది. అంతకుముందు పలు కేసుల్లో జైలుకు వెళ్లాడు. దీంతో దండామణి తన పిల్లలను తీసుకుని తల్లిదండ్రుల చెంతకు చేరి కూలి పనులతో జీవనం సాగిస్తోంది. మధుకర్‌రెడ్డి ఈనెల 14న బెంగళూరు జైలు నుంచి విడుదలై నేరుగా మదనపల్లెకు వచ్చాడు. భార్యాపిల్లలు నివాసం ఉంటున్న జగన్‌కాలనీకి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ భార్యను కాపురానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో స్థానికంగా పంచాయితీ పెట్టి భార్యను కాపురానికి పంపాలని అత్తామామలను కోరాడు. పంపేది లేదని వారు తెగేసి చెప్పడంతో గొడవకు వెళ్లాడు. అడ్డొచ్చిన బావమరిది వీరభద్రారెడ్డిపై దాడి చేసి అతని చెయ్యి విరిచేశాడు. భార్యపై కక్ష పెంచుకున్నాడు. పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. శనివారం సాయంత్రం దండామణి ఇంట్లో ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పథకం ప్రకారం కొడవలితో నరికి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు వచ్చి బావమరిది వీరభద్రారెడ్డికి ఫోన్‌చేసి నీ అక్కను చంపేశాను..ఇక మిగిలింది మీరేనంటూ బెదిరించి పారిపోయాడు. వీరభద్రారెడ్డి తన తల్లి అమరావతితో కలసి అక్క ఇంటికొచ్చి చూడగా దండామణి రక్తపుమడుగులో శవమై పడి ఉంది. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ బుచ్చిరాజు, సీఐ కళావెంకట్రమణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ పడి ఉన్న మచ్చుకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. వారం పది రోజులుగా దంపతుల మధ్య గొడవలు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరుగుతున్నాయని స్థానికులు వివరించారు. దండామణి తన భర్త చెప్పినమాట విని కాపురానికి వెళ్లకపోవడంతో ఆమెను హతమార్చినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 02:01 AM