విస్తారంగా వర్షాలు ... నిండుతున్న చెరువులు
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:00 AM
ఎల్నినో కారణంగా జిల్లాలో ఎండిపోయిన చెరువులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరి పీల్చుకుంటున్నాయి. వర్షాకాలం మొదలైనా దోబుచులాడిని మబ్బులు, ఎట్టకేలకు కనికరించాయి.
మదనపల్లె టౌన్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఎల్నినో కారణంగా జిల్లాలో ఎండిపోయిన చెరువులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరి పీల్చుకుంటున్నాయి. వర్షాకాలం మొదలైనా దోబుచులాడిని మబ్బులు, ఎట్టకేలకు కనికరించాయి. చల్లని గాలులతో మబ్బులు కరిగి వర్షంగా మారి జిల్లాలో వాతావరణాన్ని శాంతింపజేశాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు లోటు వర్షపాతం ఉండగా, అక్టోబరు నెలలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో లోటువర్షపాతం తగ్గిపోతూ కనిపిస్తోంది.
అన్ని మండలాల్లోనూ వర్షం
ఈనెల 5వ తేదీ రాత్రి కురిసిన వర్షం 10 రోజుల తర్వాత వరుసగా రెండు రోజులు కురిసింది. శుక్ర, శనివారం రాత్రి జిల్లాలోని అన్ని మండలాల్లో కురిసింది. ఈనెల 15వ తేదీ అన్ని మండలాల్లో కలిపి నమోదైన వర్షపాతం కేవలం 26.0మి.మీ మాత్రమే. 16వ తేదీ 141.2 మి.మీ, 17న 732.8, 18న 255.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద ఈనెల ఒకటో తేదీ నుంచి లెక్కవేస్తే జిల్లాలో 1155.1 మి.మీ వర్షపాతం నమోదైంది. 18 రోజులుగా కురవాల్సిన సాధారణ వర్షపాతం 1994.5 మి.మీ ఉండగా, 2311 మి.మీ వర్ష్షపాతం కురిసింది. వర్షాకాలం(జూన్ నుంచి)సాధారణ వర్షపాతం 11,920 నమోదు ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు నాలుగున్నర నెలల కాలంలో 6,398 మి.మీ వర్షపాతం కురిసింది. దీంతో 71శాతం లోటు వర్షపాతం ఉన్న జిల్లాలో ఈ శాతం 46.3శాతానికి తగ్గింది. ఇదే వర్షాలు ఇంకో నాలుగు రోజులు కురిస్తే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడంతో పాటు, రైతుల రబీసాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.