ప్రబలిన జలుబు, దగ్గు, జ్వరాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:38 AM
ఎల్‌నినో కారణంగా వాతావరణంలో చిత్రమైన మార్పులు కన్పిస్తున్నాయి. సెప్టెంబరులోనూ ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటింటా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. కొందరిలో పైకి జ్వరం లేకపోయినా జలుబు, దగ్గు, నీరసంతో మంచానికి అతుక్కుపోతున్నారు. కొందరికి ప్రాణాంతకమైన డెంగీ కూడా సోకుతోంది
భయపెడుతున్న డెంగ్యూ కేసులు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
ఎల్‌నినో కారణంగా వాతావరణంలో చిత్రమైన మార్పులు కన్పిస్తున్నాయి. సెప్టెంబరులోనూ ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటింటా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. కొందరిలో పైకి జ్వరం లేకపోయినా జలుబు, దగ్గు, నీరసంతో మంచానికి అతుక్కుపోతున్నారు. కొందరికి ప్రాణాంతకమైన డెంగీ కూడా సోకుతోంది. ఆస్పత్రులకు పరుగులు తీసి ఏ స్థాయి వైద్యం తీసుకున్న వ్యక్తినైనా వారం,పది రోజులు పాటు జ్వరం, నీరసం వేధిస్తోంది.
తిరుపతి సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):తిరుపతి నగరపాలక సంస్థ లెక్కల ప్రకారం ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 40 డెంగూ కేసులు నమోదయ్యాయి. జులైలో 9 డెంగ్యూ కేసులు నమోదైతే అందులో ప్రకాశం రోడ్డు ప్రాంతానికి చెందినవారే 8 మంది ఉండడం గమనార్హం.ఇదే ప్రాంతంలో ఆగస్టులోనూ 3 కేసులు నమోదయ్యాయి.నగరంలో 36 డయేరియా కేసులు, 21 టైఫాయిడ్ కేసులు ,3 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి.ఇదంతా నగరంలోని ఆరోగ్య కేంద్రాలనుంచి నగరపాలక సంస్థకు అందిన సమాచారమే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల లెక్కలు తీస్తే వీటికి వంద రెట్లుంటుందని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
వీటివలనే వ్యాధులు
ప్రధానంగా నీరు (వాటర్ బోర్న్), దోమలు (వెక్టర్ బోర్న్), గాలి (ఎయిర్ బోర్న్) ద్వారా ఈ సీజన్‌లో ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. నీటి ద్వారా గ్యాస్ట్రోఎంటైటిస్, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు వస్తే దోమల ద్వారా మలేరియా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులు వస్తాయి. ఇక గాలి ద్వారా స్వైన్ ఫ్లూ, వైరల్ జ్వరాలు సోకుతాయి.
ఆస్పత్రులు కిటకిట
తిరుపతి రుయాస్పత్రిలో రోజుకు సుమారు 1500 మంది ఓపీకి వస్తుంటే ఇందులో 40 శాతం మంది జ్వర పీడితులే ఉన్నారు.అంటే రోజుకు 600 మంది నిరుపేదలు జ్వరంతో బాధపడుతూ రుయాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. స్విమ్స్ విషయానికి వస్తే జ్వరం తొలి దశ రోగుల తాకిడి పెద్దగా లేనప్పటికీ జ్వరం తీవ్రత పెరిగి తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలతో రోజుకు సుమారు 150 మంది రోగులు వస్తున్నారు.తిరుపతిలో 13 అర్బన్ హెల్త్ సెంటర్లుండగా ఐదింటికి 90 నుంచి 110మంది దాకా ఓపీకి వస్తున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
వాతావరణంలో విపరీత మార్పుల కారణంగా జ్వరాలు పెరుగుతున్నాయి. వైరల్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.కమిషనర్ జయకృష్ణ అదేశాల మేరకు ఎప్పటికప్పుడు డివిజన్లలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జాగ్రత్తలు చెబుతున్నాం. నీటి నిల్వలు ఉన్న చోట రసాయనాలు వదులుతున్నాం. కాలువల్లో స్ర్పే చేస్తున్నాం.
- డాక్టర్ యువ అన్వేష్,
హెల్త్ ఆఫీసర్, తిరుపతి నగరపాలక సంస్థ