ఎందుకా నిర్లక్ష్యం!
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:18 AM
అనధికార లే అవుట్లలో ఇళ్లు కట్టాలంటే తుడా ఆమోదం ఉండదు. బ్యాంకుల నుంచి రుణాలు రావు. క్రయ, విక్రయాలు జరగవు. లే అవుట్ నిర్వాహకుల తీరుతో ప్లాట్లు కొన్న వారికి ఈ పాట్లు తప్పవు. అయినా, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్వాహకులు ముందుకు రావడం లేదు. ఎందుకా నిర్లక్ష్యం అనేది అంతుపట్టడం లేదు.
ఎల్‌ఆర్‌ఎ్‌సకు ముందుకురాని లేఅవుట్ల నిర్వాహకులు
23తో ముగియనున్న గడువు
అనధికార లే అవుట్లలో ఇళ్లు కట్టాలంటే తుడా ఆమోదం ఉండదు. బ్యాంకుల నుంచి రుణాలు రావు. క్రయ, విక్రయాలు జరగవు. లే అవుట్ నిర్వాహకుల తీరుతో ప్లాట్లు కొన్న వారికి ఈ పాట్లు తప్పవు. అయినా, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్వాహకులు ముందుకు రావడం లేదు. ఎందుకా నిర్లక్ష్యం అనేది అంతుపట్టడం లేదు.
- తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి
జిల్లాలో గత ఐదేళ్లలో వేలాది అక్రమ లేఅవుట్లు వెలిశాయి. అనధికారికంగా భవనాలూ కట్టారు. వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూములుగా మార్చాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసె్‌సమెంటు( ఎక్స్‌టర్నల్ డెవలె్‌పమెంటు చార్జీలు) కింద తుడాకు భూమి రిజిస్ర్టేషన్ జరిగిన సంవత్సరం, డాక్యుమెంటు విలువలో 4 శాతం చెల్లించాలి. అలా చెల్లించకుంటే ల్యాండ్ కన్వర్షన్ జరగదు. కానీ చాలామంది యజమానులు ల్యాండ్ కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. దీనికి తోడు అక్రమ లేఅవుట్లుపై అధికారులు సకాలంలో సబ్ రిజిస్ర్టేషన్ కార్యాలయాలకు జాబితా పంపక పోవడం కూడా అనధికార లే అవుట్లకు ఊతమిచ్చినట్లు అవుతోంది. వీటి క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం గతేడాది అక్టోబరు 23న ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) జీవో విడుదల చేసింది. ఇందులో 2025 జూన్ 30కి ముందు రిజిస్ర్టేషన్ అయిన స్థలాలను క్రమబద్ధీకరణకు అర్హతగా నిర్ణయించింది. నిర్దేశించిన గడువులో ఆశించిన స్పందన రాక పోవడంతో ఈ ఏడాది జనవరి 23 వరకు గడువు పొడిగించింది. వాస్తవానికి తిరుపతితో పాటు తుడా పరిధిలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ క్రమబద్ధీకరణకు ముందుకు రావడంలేదు. ఇప్పటి వరకు తుడా పరిధిలో 3500 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు ప్లానింగ్ అధికారులు గుర్తించినా, దాదాపు రెండు వేల దరఖాస్తులే వచ్చాయి. వీటిల్లో పూర్తి స్థాయిలో నగదు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకుంది 246 మంది మాత్రమే. ఈ విషయంలో ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకునేలా వారికి అవగాహన కల్పించడంలో తుడాలోని సంబంధిత అధికారులు, సిబ్బంది పెద్దగా చొరవ చూపడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా లే అవుట్ క్రమబద్ధీకరించకుంటే.. ప్లాట్లు కొన్నవారికి ఎప్పటికైనా ఇబ్బందే. ఎవరికి వారు తమ స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఎలాంటి అనుమతుల్లేకుండా ఇల్లు కట్టుకుంటే.. ఎల్‌ఆర్‌ఎ్‌సతో పాటు బీఆర్‌ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కూడా చేసుకోవాల్సి రావడం భారమవుతుంది. కాగా, ఎల్‌ఆర్‌ఎస్ గడువు కేవలం నాలుగు రోజులే ఉందని తుడా ప్లానింగ్ అధికారి దేవికుమారి తెలిపారు. ‘దరఖాస్తు చేసుకున్న వారు త్వరితగతిన తుడాకు డబ్బులు చెల్లిస్తే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు ఇస్తాం. ఈ విషయంలో సంబంధిత యజమానులు ముందుకు వచ్చి లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి’ అని ఆమె సూచించారు.
ఇదీ లెక్క
గుర్తించింది: 3500 అనధికార లే అవుట్లు
దరఖాస్తులు వచ్చింది: 2 వేలు
ఇప్పటికి క్రమబద్ధీకరించుకుంది: 246