అక్కడే రోడ్డు ప్రమాదాలు ఎందుకు?
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:12 AM
బ్లాక్ స్పాట్లలో అధికారుల సర్వే
చిత్తూరు సిటీ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా బెంగళూరు - తిరుపతి జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో రవాణా, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ అధికారుల సమన్వయంతో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం చిత్తూరు సమీపంలోని ఇరువారం నుంచి తేనెబండ జంక్షన్, బ్యాన్స్ హోటల్ జంక్షన్ (కాణిపాకం సర్కిల్), పట్నం జంక్షన్, పూతలపట్టు జంక్షన్, గాదంకి టోల్ ప్లాజా వరకు ఉన్న బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలు)పై అధికారులు సర్వే నిర్వహించారు. జిల్లా రవాణాశాఖ అధికారులతో పాటు ఆయా మండలాల పోలీసు, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులు పాల్గొని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశాలను క్షుణంగా పరిశీలించి నివేదికలను తయారు చేశారు.
అధికారులు గుర్తించిన అంశాలు
తమ పరిశీలనలో అధికారులు గమనించిన విషయాల్లో ముఖ్యంగా... ఎన్‌హెచ్ పక్కనున్న సర్వీస్ రోడ్లను పక్కనే ఉన్న హోటళ్లు, దాబాలు, ఇతర దుకాణాల వారు ఆక్రమించడం. డివైడర్లు లేకపోవడం, రోడ్డు వెడల్పు తగ్గిపోవడం, దుకాణదారులు, సమీప గ్రామాల ప్రజలు సర్వీస్ రోడ్డు నుంచి ఎన్‌హెచ్‌ను కలుపుతూ అనధికార తాత్కాలిక రోడ్డు నిర్మాణాలు చేపట్టడం వల్ల వాహనదారులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రెడ్‌లైట్ ఏర్పాటు చేయడం, ఆక్రమణకు గురైన రోడ్డును స్వాధీన పరచుకుని డివైడర్లను ఏర్పాటు చేస్తే కొంత వరకు ప్రమాదాలను నివారించవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. వీటితో పాటు మరికొన్ని కారణాలను గుర్తించిన అధికారులు.. వాటి నివారణకు సూచనలతో సూచనలతో నివేదిక రూపొందించి కలెక్టర్‌కు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు రాజేశ్వరరావు, టీఎన్ మురళి, హిమసాయి, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ అధికారులు పాల్గొన్నారు.