Share News

నిన్నెందుకురా పనికి రాలేదు?

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:34 AM

మామిడి చెట్లకు రసాయన మందులు పిచకారీ చేసేందుకు కూలి పనులకు వెళ్లారు

నిన్నెందుకురా పనికి రాలేదు?
సీఐ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న మృతుని తల్లిదండ్రులు కృష్ణవేణి, సుబ్రహ్మణ్యం, కుటుంబ సభ్యులు ( ఇన్‌సెట్‌లో) మనోజ్‌ ఫైల్‌ఫోటో

బంగారుపాళ్యం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘నిన్న ఎందుకురా నువ్వు పనికి రాలేదు’ అంటూ స్నేహితుడిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మొదలైన గొడవ.. మనోజ్‌(21) చావుకు దారితీసింది. బంగారుపాళ్యం మండలం సదకుప్పంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. సదకుప్పం దళితవాడకు చెందిన మనోజ్‌, రామ్‌చరణ్‌, సిద్ధార్థ్‌.. ముగ్గురూ స్నేహితులు. అదే గ్రామ సమీపంలో భానురెడ్డికి చెందిన మామిడి చెట్లకు రసాయన మందులు పిచకారీ చేసేందుకు బుధవారం కూలి పనులకు వెళ్లారు. మంగళవారం పనికి ఎందుకు రాలేదంటూ రామ్‌చరణ్‌ను మనోజ్‌ అడిగారు. నన్నెందుకు అడుగుతావురా అంటూ తిరిగి చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. చివరకు ఘర్షణకు దారితీసింది. తన తమ్ముడు జానకిరామ్‌కు రామ్‌చరణ్‌ ఫోనుచేసి పిలిపించారు. మామిడి తోట వద్దకు చేరుకున్న జానకిరామ్‌, రామ్‌చరణ్‌ కలిసి మనోజ్‌పై దాడి చేశారు. దీతో అతడు స్పృహ కోల్పోయి కిందపడి పోయారు. దీన్ని గమనించిన మందులు పిచికారి చేసే ట్రాక్టర్‌ డ్రైవర్‌ సుమంత్‌రెడ్డి ఫోన్‌ ద్వారా మనోజ్‌ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని మనోజ్‌ను అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మనోజ్‌ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సీఐ కత్తి శ్రీనివాసులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారించారు. మనోజ్‌ తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు రామ్‌చరణ్‌, జానకిరామ్‌పై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మనోజ్‌ మృతదేహాన్ని బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మనోజ్‌ భార్య శ్రీతాగిని ఎనిమిది నెలల గర్భిణి. పోలీసు స్టేషన్‌ వద్ద ఆమె రోదన అక్కడివారికి కంటతడి పెట్టించింది. మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్‌పీ ధరణీ ప్రసాద్‌, కార్యదర్శి జనార్దన్‌ గౌడ్‌, నేతలు కోదండ యాదవ్‌, హేమచంద్ర నాయుడు, కమల్‌నాథ రెడ్డి, లోకనాధం నాయుడు మనోజ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Feb 05 , 2026 | 01:34 AM