‘కోట’లో పాగే వేసేది ఎవ్వరో?
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:31 AM
బి.కొత్తకోట నగర పంచాయతీ మొదటి చైర్మన్ ఎవరు అనే సందిగ్ధతకు సోమవారం తెరపడనుంది. ఈ నెల 26న జరిగిన నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కొన్ని గంటల్లో తేలనున్నాయి.
- నేడే బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు
- జయాపజయాలపై ఉత్కంఠ
- కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత
బి.కొత్తకోట నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి) : బి.కొత్తకోట నగర పంచాయతీ మొదటి చైర్మన్ ఎవరు అనే సందిగ్ధతకు సోమవారం తెరపడనుంది. ఈ నెల 26న జరిగిన నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కొన్ని గంటల్లో తేలనున్నాయి. పట్టణ శివారులోని మోడల్ స్కూల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. చైర్మన్ పదవికి 9 మంది, 23 కౌన్సిలర్ పదవులకు 70మంది పోటీలో ఉన్నారు. వారి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో దాగిఉంది. మొత్తం 23,368 ఓట్లలో 16,430 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషులు 7960, మహిళలు 8470 ఉన్నారు.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల్లో విజయంపై టీడీపీ అభ్యర్థి కుడుం శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాదబాబు ప్రచారం చేయడం, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన నేపథ్యంలో ఓటర్లు తమవైపే మొగ్గు చూపారని శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సంప్రదాయ ఓట్లు తమకే ఉన్నాయని, అధికార దుర్వినియోగం జరిగినా ఓటర్లు, కౌన్సిలర్ అభ్యర్థులు గట్టిగా నిలబడ్డారని వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ చెబుతున్నారు.