స్విమ్స్ డైరెక్టర్ ఎవరు?
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:45 AM
టీటీడీ నిర్వహణలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్‌గా ఎవరు రాబోతున్నారన్న చర్చ వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది.
- రేపటితో ముగియనున్న ఆర్వీ కుమార్ పదవీకాలం
- ఆశావహులకు ఎన్‌ఎంసీ అడ్డంకి
- ప్రస్తుత డైరెక్టర్‌నే కొనసాగిస్తారా?
టీటీడీ నిర్వహణలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్‌గా ఎవరు రాబోతున్నారన్న చర్చ వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ఈక్రమంలో పలువురు ఆశావహల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేర అర్హతలు లేనట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుత డైరెక్టర్‌కే ఏడాదిపాటు కొనసాగింపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
- తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి
స్విమ్స్ ఉద్యోగాల నియామకం కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. వివిధ విభాగాల్లోని ఉద్యోగాల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి చేయాలంటే ప్రస్తుత డైరెక్టర్‌కే అవగాహన ఉంటుంది. అదేవిధంగా వివాదరహితుడిగా, ఉన్నతాధికారుల ఆదేశాలకనుణంగా నడుచుకుంటున్న వ్యక్తినే కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో ఇప్పటివరకు కొత్త డైరెక్టర్‌ను నియమించలేదంటే ఆర్వీ కుమార్‌నే కొనసాగిస్తారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇక టీటీడీ వైద్య సంస్థలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి బర్డ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జగదీ్‌షకు పాలనాపగ్గాలు ఇవ్వాలని గతంలో టీటీడీ భావించింది. ఆ మేరకు పాలకమండలి చైర్మన్ కూడా ప్రకటించారు. అయితే జగదీష్ వయసు 70 ఏళ్లు దాటిపోవడంతో స్విమ్స్ వీసీ పదవికి అనర్హుడుగా చెబుతున్నారు. కానీ టీటీడీ వైద్య సంస్థలన్నింటికీ ఇన్‌చార్జిగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, స్విమ్స్ వీసీగా డైరెక్టర్‌గా ఉన్నవారే కొనసాగతారన్న చర్చ నడుస్తోంది. ఇక స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వనజ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. కార్జియాలజి్‌స్టగా ఆమెకు మంచి పేరుంది. రామచంద్ర మిషన్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు. వైద్య వృత్తిలో ఎంత అంకితభావంతో ఉంటారో, ఆధ్యాత్మికత చింతనలోనూ కనిపిస్తుంటారు. స్విమ్స్ వీసీ పదవికి ఎన్‌ఎంసీ నిబంధనలు మేర ఆమెకు అర్హత లేదని తెలుస్తోంది. అయినా తనకు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించాలన్న ఆలోచనలేదని సన్నిహితులతో ఆమె చెప్పినట్టు సమాచారం. ఇక సూపరింటెండెంట్ స్థాయి అధికారి కూడా తన ప్రయత్నాలు కొనసాగించినట్టు సమాచారం. ఇతనికి వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలంటే నోటిఫికేషన్ ఇచ్చి సెర్చ్ కమిటీ ద్వారా డైరెక్టర్‌ను నియమించడమే ఉత్తమమని పలువురు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.