Share News

ఇన్‌చార్జిగా ఎవరిని కోరుకుంటున్నారు?

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:40 AM

తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎంపికపై శ్రేణుల అభిప్రాయాలను నేతలు సేకరించారు. వాటిని అధిష్ఠానానికి నివేదించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, పార్టీ జోనల్‌ ఇన్‌చార్జి దామచర్ల సత్య పేర్కొన్నారు.

ఇన్‌చార్జిగా ఎవరిని కోరుకుంటున్నారు?
సమావేశానికి హాజరైన మంత్రులు బి.సి.జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, దామచర్ల సత్య, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌బాబు, ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా, రాజంపేట, రైల్వేకోడూరు, పుంగనూరు ఇన్‌చార్జులు జగన్‌మోహన్‌రాజు, ముక్కా రూపానందరెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి

తంబళ్లపల్లెపై పార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ

తమనూ లోపలికి పంపాలని జయచంద్రారెడ్డి వర్గీయుల వాగ్వాదం

ఇన్‌చార్జిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎందుకు? మీ పేరు.. పార్టీలో హోదా ఏంటి?

- ఇలా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎంపికపై శ్రేణుల అభిప్రాయాలను నేతలు సేకరించారు. వాటిని అధిష్ఠానానికి నివేదించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, పార్టీ జోనల్‌ ఇన్‌చార్జి దామచర్ల సత్య పేర్కొన్నారు.

ఈ అభిప్రాయ సేకరణకు తిరుపతిలోని ఓ హోటల్‌ వేదికైంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచీ పార్టీ మండలాధ్యక్షులు, జోన్‌, యూనిట్‌ ఇన్‌చార్జ్జులు, బూత్‌ కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు.. ఇలా 272 మందికిపైగా సోమవారం నాటి సమావేశానికి ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌ వర్గీయులు, అనుచరులే ఎక్కువగా ఉన్నారని, తమకు పార్టీ నుంచి పిలుపురాలేదంటూ కొందరు కార్యకర్తలు జయచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ‘పిలుపు రాకున్నా..మీరు కూడా వెళ్లండి..మీ అభిప్రాయం కూడా చెప్పండి’ అంటూ ఆదివారం జయచంద్రారెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో సోమవారం రెండు వర్గాలూ తిరుపతి సమావేశానికి హాజరయ్యాయి. ఫోన్‌కాల్‌ వచ్చిన వారే లోపలికి రావాలని, తమ వద్ద జాబితా ఉందని నేతలు చెప్పారు. మిగిలిన వాళ్లూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇన్‌ఛార్జి ఎంపిక విషయంలో తమకూ అవకాశం కల్పించాలని వారంతా పట్టుపట్టారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబుతో వాగ్వాదానికి దిగారు. చివరకు మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి జోక్యంతో మిగిలిన వారినీ అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. లోపలకు వెళ్లిన వారందరి అభిప్రాయాలను తీసుకుని పంపించేశారు. ఇక్కడ ఇన్‌చార్జిగా ఎవరి పేరునూ అభిప్రాయ సేకరణ బృందం ప్రస్తావించలేదు. ఈ సమావేశంలో మంత్రులు బి.సి.జనార్దన్‌రెడ్డి, మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, దామచర్ల సత్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, జిల్లా మాజీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, రైల్వేకోడూరు ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి, పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

ఏడాదిన్నరగా సందిగ్ధత

తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి నియామకంలో ఏడాదిన్నరగా సందిగ్ధత నెలకొంది. ఇన్‌చార్జి మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, అప్పటి జోన్‌-4 ఇన్‌చార్జి దీపక్‌రెడ్డి తదితరులు పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేసినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌, పార్టీ నుంచి సస్పెండైన డి.జయచంద్రారెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదాలు, విభేదాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఖాళీగా ఉన్న స్థానాలకు పార్టీ ఇన్‌చార్జులను అఽధిష్ఠానం ఖరారు చేస్తోంది. ఈ క్రమంలో తంబళ్లపల్లెపైనా దృష్టి పెట్టింది.

- మదనపల్లె, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 14 , 2026 | 01:40 AM