ఎవరో ఆ ఇద్దరు!
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:11 AM
నేడు వెల్లడి కానున్న జడ్పీ ఛైర్పర్సన్ అభ్యర్థులు రెండు జిల్లాల్లోనూ మహిళలకే అధ్యక్ష పీఠాలు
తిరుపతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుపతి, చిత్తూరు జడ్పీ ఛైర్పర్సన్ల అభ్యర్థులను టీడీపీ అధిష్ఠానం నేడు వెల్లడించే అవకాశముంది. ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత వున్న సంగతి తెలిసిందే. తిరుపతిలోని 35 జడ్పీటీసీ స్థానాల్లో 28 కూటమి గెలుచుకోగా వైసీపీ 6, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం చొప్పున గెలిచాయి. వీటిలో బీజేపీకి 2, జనసేనకు ఒకటి చొప్పున సీట్లు రాగా టీడీపీవి 25 సీట్లు వున్నాయి. చిత్తూరు జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలుంటే కూటమి 23 స్థానాలను దక్కించుకోగా వైసీపీ 4 స్థానాలకు పరిమితమైంది. కూటమి గెలిచిన 23 సీట్లలో జనసేనకు ఒకటి పోగా మిగిలిన 22 సీట్లూ టీడీపీవే. దీంతో ఈ రెండు జిల్లాల్లోనూ జడ్పీ ఛైర్పర్సన్ పదవులు టీడీపీకే కేటాయించారు. ఈనెల 7న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడగా పది రోజులైనా ఛైర్పర్సన్ అభ్యర్థులను టీడీపీ అధిష్ఠానం ప్రకటించలేదు. ఆశావహులైతే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి అధిష్ఠానం ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు.
తిరుపతి నుంచి రేసులో ఇద్దరు
తిరుపతి జిల్లాలో నాగలాపురం నుంచి జడ్పీటీసీగా గెలిచిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత జడ్పీ తొలి ఛైర్పర్సన్ కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం పార్టీ అగ్రనాయకుల వద్ద తనకున్న పరిచయాలన్నింటినీ వినియోగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీకాళహస్తి నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన డాక్టర్ పనబాక చేతన సైతం జడ్పీ తొలి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాలని ఆశిస్తున్నారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె. రాజకీయాల్లో పనబాక లక్ష్మికున్న స్థాయి, విస్తృత అనుభవం, సీనియారిటీ వంటివి దృష్టిలో పెట్టుకుని ఆమె కుమార్తెకు అవకాశం ఇవ్వాలని మద్దతుదారులు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. సమీకరణలు చూస్తుంటే చేతనకే ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం.
చిత్తూరు నుంచి నలుగురు ఆశావహులు
చిత్తూరు జిల్లా నుంచి జడ్పీ ఛైర్పర్సన్ పదవికి నలుగురు రేసులో వున్నారు. వీరిలో పూతలపట్టు జడ్పీటీసీ శైలజా మూర్తి ముందంజలో వున్నారు. ఆమె భర్త తేజోమూర్తి చిత్తూరులో విజయం విద్యా సంస్థల అధినేత. ఆ విద్యాసంస్థల కారణంగా పూతలపట్టులోనే కాకుండా చిత్తూరు పరిసర మండలాలన్నింటిలో ఆయనకు విస్తృత పరిచయాలు వున్నాయి. దానికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఆర్థికంగా సహకరించినట్టు సమాచారం. వీటిని దృష్టిలో వుంచుకుని అధిష్ఠానం శైలజ వైపు మొగ్గు చూపే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. బంగారుపాళ్యం జడ్పీటీసీ సుచిత్ర పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆమె కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపధ్యం వుంది. సుచిత్ర గతంలో ఎంపీపీగా కూడా పనిచేశారు. ఆమె భర్త ఎన్పీ జయప్రకాష్ 20 ఏళ్ళ పాటు మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. యువగళం పాదయాత్రలో పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. ఆయన తండ్రి ఎన్పీ భాస్కర నాయుడు గతంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ కుటుంబానికి పార్టీ అధినేత చంద్రబాబుతో సుదీర్ఘకాలంగా సన్నిహిత పరిచయముంది. ఇక పాలసముద్రం జడ్పీటీసీ జాహ్నవి పేరు కూడా రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి భీమినేని చిట్టిబాబు గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా కూడా ఆయన పార్టీకి కష్టకాలంలో విలువైన సేవలందించారు. చిట్టిబాబు సేవలను గుర్తించి ఆయన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని మద్దతుదారులు కోరుతున్నారు. గుడిపాల జడ్పీటీసీగా గెలుపొందిన మమత శ్రీ సైతం జడ్పీ ఛైర్పర్సన్ పదవికి పోటీ పడుతున్నారు. ఆమె భర్త ఈశ్వర్ నాయుడు బెంగుళూరులో బిల్డర్‌గా వున్నారు.