పురాధీశులు ఎవరో?
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:25 AM
చిత్తూరు నగరానికి మూడోసారి జరిగిన ఎన్నికల్లో చిత్తూరు మేయర్ పీఠం అధిరోహించేదెవరు? కుప్పం, పలమనేరును పాలించేదెవరు? డివిజన్లు, వార్డులు కూటమికి ఏకపక్షంగా వస్తాయా? ప్రతిపక్ష వైసీపీకి వచ్చే సీట్లు మాటేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ‘కూటమి’కి అనుకూల సమాధానాలే వస్తున్నాయి. దీనిపై మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో స్పష్టత రానుంది.
నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఓటింగ్ సరళి తమకే అనుకూలమంటున్న కూటమి నేతలు
చిత్తూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరానికి మూడోసారి జరిగిన ఎన్నికల్లో చిత్తూరు మేయర్ పీఠం అధిరోహించేదెవరు? కుప్పం, పలమనేరును పాలించేదెవరు? డివిజన్లు, వార్డులు కూటమికి ఏకపక్షంగా వస్తాయా? ప్రతిపక్ష వైసీపీకి వచ్చే సీట్లు మాటేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ‘కూటమి’కి అనుకూల సమాధానాలే వస్తున్నాయి. దీనిపై మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో స్పష్టత రానుంది. చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటికే 50 మంది కార్పొరేటర్లు కూటమి.. ఒకరు వైసీపీ తరపున ఏకగీవ్రమయ్యారు. మిగిలిన 9 చోట్ల జరిగిన ఎన్నికల్లో.. ఆరు డివిజన్లలో కూటమి పార్టీలూ రెబల్స్‌గా ఉన్నాయి. ఎవరెంత ఓటింగ్ షేర్ తీసుకున్నారనేదాన్ని బట్టి ఆ డివిజన్లలో మెజారిటీలు లేదా ఫలితాలపై ప్రభావం చూపొచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇక, కూటమిలో ఏకగ్రీవాల ఉత్సాహం.. నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో శ్రేణులు సక్సెస్ కావడం.. ప్రభుత్వం పనితీరు.. వెరసి మేయర్ అభ్యర్థి కఠారి హేమలతకు విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో 50 స్థానాలు కోల్పోయిన నైరాశ్యంలో వైసీపీ శ్రేణులు ఉండటం.. ప్రతికూలంగా మారింది. ఇక, నగరిలో ఇప్పటికే మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి ఈఎన్ శ్రీనివాసన్.. నలుగురు కౌన్సిలరు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 36 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ టీడీపీ ఎంత భారీ మెజారిటీతో కౌన్సిలర్లను గెలుచుకుంటుందనే దానిపైనే దృష్టి ఉంది.
కుప్పం: ‘ఆధిక్యం’పైనే టీడీపీలో ఉత్కంఠ
- వైసీపీలో ఒకట్రెండు వార్డులపై ఆశ
కుప్పం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుప్పం మున్సిపాలిటీలో గెలుపుపై కాదు.. ఆధిక్య మెజారిటీలపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. ఏ వార్డులో ఎవరికి.. చైర్మన్‌గా ఎంత మెజారిటీతో గెలుస్తారనే దానిపైనే సోమవారమంతా నాయకులు టెన్షన్‌తో ఉన్నారు. ఎందుకంటే.. టీడీపీ నాయకులు, అభ్యర్థుల సామర్థ్యానికి మున్సిపల్ ఎన్నికల్లో సాధించబోయే అత్యధిక మెజారిటీయే ప్రామాణికంగా నిలవనుంది. అధికారంలో ఉండి, విజయంమీద ఽధీమా ప్రదర్శిస్తున్న టీడీపీ అభ్యర్థులు, నాయకులకూ ఇంత ఉత్కంఠ ఎందుకన్నది ఆ పార్టీ వ్యవహారాలను సూక్ష్మంగా పరిశీలిస్తేనే తెలుస్తుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి రూ.కోట్ల నిఽధులు వ్యయం చేశారు. మరీ ముఖ్యంగా 2024లో గెలిచాక అటు పారిశ్రామికంగా, ఇటు వ్యావసాయికంగా ఆయన చేసిన అభివృద్ధి ప్రజల కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతోంది. ఇక కుప్పం మున్సిపాలిటీలో రోడ్లు, కాలువలు, తాగునీరు, భవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బడిముబ్బడిగా సాగింది. ఈ దశలో కుప్పం మున్సిపాలిటీకి రెండోసారి ఎన్నికలు జరిగాయి. అటువంటప్పుడు మెజారిటీలు కూడా రికార్డు స్థాయిలోనే రావాలని అధినేత ఆకాంక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా అలాగే ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తీరాలని చెప్పడమే కాదు, దిశానిర్దేశం కూడా చేశారు. కేవలం అభ్యర్థులవే కాదు, మున్సిపల్ ఎన్నికలకు నేతృత్వం వహించిన నాయకుల భవితవ్యాలు కూడా మంగళవారమే తేలనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాత్రమే కాదు, సాధించబోయే మెజారిటీలతో వారి రాజకీయ భవిష్యత్తు ముడిపడి వుంది. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే అధినేత చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. అందుకనే టీడీపీలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితాల తర్వాత పార్టీలో ఎవరి జాతకాలు ఎలా ఉంటాయోన్న ఆందోళన పార్టీ వర్గాల్లో అంతర్గతంగా కొనసాగుతోంది. ఇక, ప్రతిపక్ష వైసీపీ.. ఒకట్రెండు వార్డులపై ఆశలు పెట్టుకుంది.
పలమనేరు.. పాలించేదెవరు?
- తొలి విజయానికి టీడీపీ ఆరాటం
పలమనేరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పలమనేరు పాలకులెవరో మంగళవారంతో తేలిపోనుంది. 42,500 మందికి గాను 30,928 మంది ఓటేశారు. 36 వార్డులకు గాను ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, 30 వార్డులకు, చైర్‌పర్సన్‌కు ఓటింగ్ జరిగింది. పట్టణంలో వెయ్యికిపైగా మహిళా సంఘాల్లో 8వేల మంది సభ్యులున్నారు. మైనారిటీ ఓటర్ల తీర్పు కూడా చైర్పర్సన్ ఎన్నికలో కీలకం కానుంది. ఓటు వేసిన వారిలో వీరే ఎక్కువ. ఇక్కడ ఓ పార్టీ ఓటుకు రూ.వెయ్యి, మరోపార్టీ రూ.2వేల చొప్పున పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్, తర్వాత రెండుసార్లు వైసీపీ కౌన్సిల్‌ను గెలుచుకున్నాయి. నాలుగోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. తొలి విజయం సాధిస్తామన్న నమ్మకంతో టీడీపీ ఉంది. కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధినే తమను గెలిపిస్తుందని ఆపార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్ల మేర వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది. ప్రధాన రోడ్లు సీసీ, బీటీరోడ్లుగా మార్చింది. మురుగునీటి కాలువల నిర్మాణానికీ నిధులు వెచ్చించింది. ఈ పనులే తమ పార్టీకి చెందిన చైర్పర్సన్ అభ్యర్థితో పాటు మెజారిటీ కౌన్సిలర్లను గెలిపిస్తుందని అంటున్నారు.