ఆ రెండు శాఖలకు అధికారులేరీ?
ABN , Publish Date - May 23 , 2026 | 12:43 AM
బలహీన వర్గాలకు చెందిన రెండు శాఖలకు రెగ్యులర్ అధికారుల్లేరు
చిత్తూరు అర్బన్, మే 22(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బలహీన వర్గాలకు చెందిన రెండు శాఖలకు రెగ్యులర్ అధికారుల్లేరు. ఇన్‌చార్జి అధికారులతో పాలన కొనసాగుతుండటంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దాని పర్యవసానం ఎస్సీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖలపై పడుతోంది.
మూడేళ్లకుపైగా ఈడీ లేదు
ఎస్సీ కార్పొరేషన్‌కు మూడేళ్లకుపైగా రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) లేరు. వైసీపీ హయాంలో అప్పటి ఈడీ రాజశేఖర్ నాయుడు పదవీ విరమణ పొందారు. అప్పట్నుంచి ఇన్‌చార్జీ ఈడీలుగా చెన్నయ్య, విక్రమ్‌కుమార్‌రెడ్డి.. ప్రస్తుతం డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి పనిచేస్తున్నారు. ఇలా ఇన్‌చార్జుల పాలన కొనసాగతుండటంతో కొత్త రుణాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. గతంలో ఇచ్చిన రూ.కోట్ల రుణాలను రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ శాఖకు క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో జిల్లా కార్యాలయంలో పనిచేసే అధికారులే ఊరూరా తిరుగుతున్నారు. రికవరీ చూపిస్తేనే జీతాలిస్తామని చెప్పడంతో ఏళ్లపాటు కార్యాలయానికే పరిమితమైన అధికారులు, సిబ్బంది పల్లెలకు పరుగులు తీస్తున్నారు. రెగ్యులర్ ఈడీ ఉంటే అధికారులు, సిబ్బందితో సమీక్షలు చేసి రికవరీని పెంచడంతో పాటు కొత్త రుణాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంచనాలను పంపించి దళిత వర్గాలను అభివృద్ధి చేసే దిశగా పనిచేసే అవకాశం ఉంది. డీఆర్‌డీఏ పీడీగా ఉన్న శ్రీదేవి.. తన శాఖతో పాటు ఇక్కడా చూడాల్సి రావడంతో పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నారు.
రెగ్యులర్ డీడీ వచ్చేదెప్పుడో?
జిల్లా సాంఘిక సంక్షేమశాఖకు నాలుగు నెలలుగా డిప్యూటీ డైరెక్టర్ లేరు. గతంలో ఉన్న డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి పోస్టింగ్‌లో ఏర్పడిన సమస్యల కారణంగా ఆయన్ను అమరావతికి బదిలీ చేశారు. సరిగ్గా టెన్త్ విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయానికి వెళ్లిపోయారు. టెన్త్ ఫలితాల్లో జిల్లా విద్యాశాఖకు 76 శాతం వస్తే.. సాంఘిక సంక్షేమశాఖకు 73 శాతం వచ్చింది. గత వైసీపీ హయాంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయ్యాయి. వైసీపీ హయాంలో జిల్లా వ్యాప్తంగా 2200 మంది విద్యార్థులు ఉండగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఆ సంఖ్య 3500కు పెరిగింది. జిల్లాలో వసతి గృహాల మరమ్మతుల కోసం రూ.12 కోట్లను విడుదల చేసింది. వాటిలో సగం పనులు వందశాతం పూర్తవ్వగా మిగిలినవాటిని ఈ వేసవి సెలవుల్లో పూర్తి చేయాల్సి ఉంది. డీడీ లేకపోవడంతో వసతి గృహాల్లో మరమ్మతు పనులు ముందుకుసాగడం లేదు. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పానికి ప్రత్యేకంగా రూ.3కోట్లను విడుదల చేయగా.. అక్కడ కూడా పనులు ముందుసాగడం లేదు. మరో 20 రోజుల్లో సెలవులు ముగించుకుని తిరిగి వసతి గృహాలను పున: ప్రారంభించాల్సి ఉంది. ఆ లోపు గ్రామాల్లో తిరిగి విద్యార్థులకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సి ఉంది. డీడీ లేకపోవడంతో వార్డెన్లు విద్యార్థుల చేర్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.