శరీరాలపై కొరడాల నాట్యం
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:22 AM
పూజారులచే దెబ్బలుతిన్న భక్తులు కుప్పంలో వైభవంగా శ్మశాన కొల్ల
కుప్పం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మోకాళ్లపై కూర్చున్నారు. పూజారుల కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా అమ్మవారి మీద తమ భక్తిని చాటుకున్నారు. కుప్పంలో మంగళవారం నాటారు కులస్తుల (బెస్త కులస్తులు) ఆధ్వర్యంలో శ్మశాన కొల్ల పర్వం వైభవంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా జరిగింది. మహాశివరాత్రి ముగిశాక వచ్చే అమావాస్యనాడు జరిగే ఈ పర్వాన్ని అంకాళపరమేశ్వరి జాతరగా కూడా పిలుస్తారు. కుప్పం పట్టణం కొత్తపేట నాటారు వీధిలో కొలువై ఉన్న అంకాళ పరమేశ్వరి మాతకు మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి. అక్కడ్నుంచి అమ్మవారిని మధ్యాహ్నం వేళ డప్పులు, డోళ్ల వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లారు. కుప్పం నడిబొడ్డున ఉన్న శ్మశానంలో అంకాళపరమేశ్వరిని కొలువుదీర్చారు. అంతకుముందే అమ్మవారి భీకర రూపాన్ని శ్మశానం నడిబొడ్డున మట్టితో తీర్చిదిద్దారు. శ్మశానంనుంచి తవ్వితీసిన మానవ కంకాళాలు, ఎముకలతో అలంకరించి, పసుపు కుంకుమలతో పూజలు చేశారు. నిమ్మకాయలు కోసి, జంతు బలులిచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అప్పుడు ప్రారంభమైంది అసలైన శ్మశాన కొల్ల ఉత్సవం. డప్పుల మోతకు భక్తులు పూనకాలతో ఊగిపోతూ శ్మశానం మీద పడ్డారు. మన్ను సమాధులనుంచి మానవ కంకాళాలు తవ్వితీసి పళ్లతో కరకర కొరుతూ నృత్యం చేస్తూ భీతావహ దృశ్యాన్ని ఆవిష్కరించారు. మరోవైపు కొందరు సాధారణ పూనకాలతో జుట్టు విరబోసుకుని ఊగిపోయారు. పూజారుల కొరడాలు వారి శరీరాల మీద నాట్యం చేశాయి. పూనకాలు రానివారు మోకాళ్లమీద కూర్చుని పూజారుల కొరడా దెబ్బలు తిని అమ్మవారి మీద భక్తిని చాటుకున్నారు. కుప్పం నియోజకవర్గనుంచే కాకుండా పొరుగున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.