పాల వ్యాన్ను తప్పించబోయి..
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:05 AM
పాలవ్యాన్ను తప్పించబోయి ఎక్స్కవేటర్ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఒకే గ్రామానికి చెందిన వీరు ప్రమాదంలో మృతి చెందడం పట్ల గుడిపాల మండలం 197 రామాపురంలో విషాదం నెలకొంది.
ఎక్స్కవేటర్ను ఢీ కొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
గుడిపాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పాలవ్యాన్ను తప్పించబోయి ఎక్స్కవేటర్ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఒకే గ్రామానికి చెందిన వీరు ప్రమాదంలో మృతి చెందడం పట్ల గుడిపాల మండలం 197 రామాపురంలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. 197 రామాపురానికి చెందిన శీను కుమారుడు హరీష్(17), నటరాజన్ కుమారుడు మహేష్ చిత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిలో హరీష్ తల్లి కరోనాలో చనిపోగా.. తండ్రి శీను రెండో పెళ్లి చేసుకుని తిరుపతిలో నివాసం ఉంటున్నారు. దీంతో హరీష్ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అలాగే మహేష్ తండ్రి నటరాజన్ శుభకార్యాలయానికి పూల డెకరేషన్ పనులు చేస్తున్నారు. కాగా, హరీష్, మహేష్ కలిసి శుక్రవారం స్కూటీపై రామాపురం నుంచి ఏఎల్పురం గ్రామం వైపు వేగంగా వెళుతుండగా మార్గమధ్యమైన సబ్స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ను తప్పించబోయి.. పక్కనే ఆపి ఉన్న ఎక్స్కవేటర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదంలో మృతి చెందడంపై గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.