Share News

ఓటేసి ఇంటికి వెళుతుండగా..!

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:37 AM

బతుకు దెరువుకోసం ఊరొదిలారు. పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ సొంతూరులో ఓటేసేందుకు భార్యాభర్తలు వచ్చారు.

ఓటేసి ఇంటికి వెళుతుండగా..!
సంఘటనా స్థలంలో చంద్రప్రకాష్‌, లక్ష్మి మృతదేహాలు

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

బంగారుపాళ్యం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బతుకు దెరువుకోసం ఊరొదిలారు. పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ సొంతూరులో ఓటేసేందుకు భార్యాభర్తలు వచ్చారు. తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు చంద్రప్రకాష్‌ (43), లక్ష్మి (38) దంపతులు. వీరిది యాదమరి మండలం మాధవరం దళితవాడ. చంద్రప్రకాష్‌ పెయింటర్‌గా పనిచేస్తూ పలమనేరు మండలం గంటావూరిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పలమనేరు నుంచి ద్విచక్రవాహనంలో భార్యభర్తలు మాధవరం గ్రామానికి వచ్చారు. ఓటేసిన అనంతరం సాయంత్రం పలమనేరుకు వెళుతుండగా.. బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె వద్ద విద్యుత్‌ స్తంభాలతో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ హఠాత్తుగా మడుపోలూరు వైపునకు మలుపు తిరిగింది. వెనుకనే వస్తున్న చంద్రప్రకాష్‌ బైక్‌ ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొంది దీంతో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం మార్చురీకి పోలీసులు తరలించారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న బంధువులు బంగారుపాళ్యం మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 30 , 2026 | 01:37 AM