Share News

ట్రామా కేర్‌ ఏదీ?

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:53 AM

హైవేలలో ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట గోల్డెన్‌ అవర్‌గా చెబుతారు. ఆ గంటలోగా అవసరమైన చికిత్స అందిస్తే 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చు. ట్రామా కేర్‌ సెంటర్‌తో ఇది సాధ్యమవుతుంది. హైవేలు.. రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఒక్కటీ లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

 ట్రామా కేర్‌ ఏదీ?

పదేళ్లుగా ప్రతిపాదనలతో సరి

హైవేలలో ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట గోల్డెన్‌ అవర్‌గా చెబుతారు. ఆ గంటలోగా అవసరమైన చికిత్స అందిస్తే 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చు. ట్రామా కేర్‌ సెంటర్‌తో ఇది సాధ్యమవుతుంది. హైవేలు.. రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఒక్కటీ లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

రాష్ట్ర, జాతీయ ప్రధాన రహదారుల్లో ప్రమాదాలు జరిగితే ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్రంగా గాయపడుతుంటారు. వీరికి స్థానిక పీహెచ్‌సీలలో ప్రాథమిక వైద్యం అందించి పెద్దాస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. అక్కడకు వెళ్కా.. గాయపడ్డ వారికి చేయాల్సిన అన్ని రకాల వైద్య పరీక్షలు ఒకేచోట అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా స్కానింగులు, శస్త్రపరీక్షలకు తిరిగే సరికి కాలం గడిచిపోతోంది. క్షతగాత్రులు మృతులుగా మారుతున్నారు. అదే క్షతగాత్రులకు తక్షణం అన్నిరకాల స్కానింగులు చేసి, అవసరమైన శస్త్ర చికిత్స అందిస్తే వారి ప్రాణాల్ని కాపాడొచ్చు. ఇలా జరగాలంటే ట్రామా కేర్‌ సెంటర్‌ ఉండాలి.

ఏమిటీ ట్రామా కేర్‌ సెంటర్‌?

ఒక ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడితే ఏయే పరీక్షలు చేయాలో.. ఎలాంటి వైద్యం అందించాలో.. సరిగ్గా అవన్నీ ట్రామా కేర్‌ సెంటర్లలో ఉంటాయి. అలా్ట్ర సౌండ్‌ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, సిటీ స్కాన్‌, బ్లడ్‌ బ్యాంకు వంటి సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. వైద్య సేవలు అందించేందుకు ఆర్థో, జనరల్‌ సర్జన్‌, న్యూరో సర్జన్‌, ఎనస్తీషియన్‌, రేడియాలజిస్ట్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌ వంటి వైద్య నిపుణులూ ఉంటారు. క్షతగాత్రులను అవసరమైన ఎంత పెద్ద చికిత్సనైనా అందించేందుకు పరికరాలు, నిపుణులు అందుబాటులో ఉండటంతో వెంటనే వైద్యం అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడతారు. ఈ సెంటర్‌ 24 గంటలూ పనిచేస్తుంటుంది.

మదనపల్లె, శ్రీకాళహస్తికి మంజూరైనా..

2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరులోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ట్రామా కేర్‌ సెంటర్‌ మంజూరైంది. దీనిని నెల్లూరులోని ప్రజాప్రతినిధులు అక్కడికి మళ్లించుకున్నారు. అలాగే మదనపల్లె, శ్రీకాళహస్తిలోని ఆస్పత్రులకు ట్రామాకేర్‌ సెంటర్లు మంజూరైనట్లు, ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా అమలు కాలేదు. నగరి, కుప్పం, పలమనేరు ఏరియా ఆస్పతుల్ర్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినా ఆమోదం లభించలేదు. కొన్నాళ్ల కిందట బంగారుపాళ్యం వద్ద ఏర్పాటు కోసం పరిశీలించినా ఫలితం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఒక్క ట్రామా కేర్‌ సెంటర్‌ కూడా లేదు.

రోజుకు ఇద్దరు చొప్పున..

జిల్లాలో 5, తిరుపతి జిల్లాలో 7.. మొత్తంగా 12 జాతీయ రహదారులున్నాయి. రోజుకు ఇద్దరు చొప్పున ఈ హైవేల్లో మరణిస్తున్నట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది లెక్కలు చూసుకుంటే నెలకు 55 మంది చొప్పున ఏడాదికి 660 మంది వాహనదారులు, పాదచారులు హైవే ప్రమాదాల్లో మరణించారు. వీరితో పాటు గాయపడినవారి సంఖ్య 1500 వరకు ఉంటోంది. వీరికీ సకాలంలో మెరుగైన వైద్యం అందక పది శాతం మంది శాశ్వత వైకల్యం పొందుతున్నారు.

రెఫర్‌తోనే పోతున్న ప్రాణాలు

చిత్తూరు జిల్లాలోని మొగిలి ఘాట్‌, చిత్తూరు- తిరుపతి హైవేలో ఎక్కడ ప్రమాదం జరిగినా తిరుపతికి, వేలూరు సీఎంసీకు రెఫర్‌ చేస్తున్నారు.

మదనపల్లె ప్రాంతంలో ప్రమాదాలు జరిగితే తిరుపతి, బెంగళూరుకు పంపిస్తున్నారు. ఎటు వెళ్లినా 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే.

తిరుపతి- కడప, తిరుపతి- నాయుడుపేట, తిరుపతి- చిత్తూరు హైవేలోని చంద్రగిరి సమీపంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరిగినా కూడా తిరుపతికి రెఫర్‌ చేస్తారు. తిరుపతిలో కూడా ట్రామా కేర్‌ సెంటర్‌ లేకపోవడం ఆందోళనకరం.

తిరుపతి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడి తలకు గాయమైంది. కాలు విరిగింది. వెంటనే స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్‌ చేసి తల, కాలికి తగిలిన దెబ్బల్ని గుర్తించారు. స్విమ్స్‌లో అందుబాటులో ఉన్న మేరకు తలకు అవసరమైన చికిత్స అందించారు. కాలికి చికిత్స కోసం అక్కడి బర్డ్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. తలకు ఆపరేషన్‌ చేసుకున్న వ్యక్తి కోలుకుని బర్డ్‌కు వెళ్లడానికి సమయం పట్టింది. ఇంతలో అతడి కాలి సమస్య తీవ్రంగా మారింది. అదే ట్రామా కేర్‌ సెంటర్‌ ఉంటే అన్నిరకాల చికిత్స ఒకేచోట లభించేది. ఈ క్షతగాత్రుడి సమస్య తీవ్రమయ్యేది కాదు.

Updated Date - Feb 14 , 2026 | 01:53 AM