నిమజ్జనానికి నీళ్లేవి?
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:09 AM
ఎల్‌నినో వినాయక విగ్రహాల నిమజ్జనాన్నీ ప్రభావితం చేసింది. పూజలనంతరం గణనాథుడ్ని గంగమ్మ ఒడికి చేర్చే ఈ దివ్య కార్యక్రమాన్ని వర్షాభావం వెంటాడింది. చెరువులు, కుంటలు ఇంకిపోయి కనుచూపు మేరలో చుక్క నీరు కనిపించడం లేదు. చేసేది లేక భక్తులు, ఉత్సవ నిర్వాహకులు ప్రతిమలను కుంటల్లో, చెరువుల ఒడ్డున వదిలేశారు.
నీళ్లు లేక బీడులోనే వదిలేసిన వినాయక విగ్రహాలు
ఎల్‌నినో వినాయక విగ్రహాల నిమజ్జనాన్నీ ప్రభావితం చేసింది. పూజలనంతరం గణనాథుడ్ని గంగమ్మ ఒడికి చేర్చే ఈ దివ్య కార్యక్రమాన్ని వర్షాభావం వెంటాడింది. చెరువులు, కుంటలు ఇంకిపోయి కనుచూపు మేరలో చుక్క నీరు కనిపించడం లేదు. చేసేది లేక భక్తులు, ఉత్సవ నిర్వాహకులు ప్రతిమలను కుంటల్లో, చెరువుల ఒడ్డున వదిలేశారు.
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వినాయకచవితి పండుగ అంటేనే వర్షాకాలంలో నిండిన చెరువులు, ఆహ్లాదకరంగా కనిపించే పంటలు అన్నమయ్య జిల్లా అంతటా గమనించేవాళ్లం. కాని ఎల్‌నినో కారణంగా ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 80శాతం చెరువులు బీడు భూములను తలపిస్తున్నాయి. అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో యువత పోటీపడి వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 350కి పైగా 10 అడుగులకు మంచి ఎత్తైన విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాలను నీట ముంచాలంటే కనీసం 10 అడుగుల లోతు చెరువులో నీరు నిల్వ ఉండాలి. జిల్లాలో అతి పెద్దవైన చెరువులు మినహా 500పైగా చిన్న చెరువుల్లో నీరు ఇంకిపోయి, చిన్నకుంటలుగా గోచరిస్తున్నాయి. వీటిలో కేవలం 2 నుంచి 4 అడుగుల లోతు నీరు మాత్రమే నిల్వ ఉంది. వినాయక చవితి సందర్భంగా ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న అడుగు నుంచి 3 అడుగుల విగ్రహాలను ఈ చిన్నకుంటల్లో ముంచి నిమజ్జనాలు చేసేశారు. కాని 10 అడుగులకు మించి ఎత్తైన విగ్రహాలు నిమజ్జనం చేయడానికి నిర్వాహకులు మండల కేంద్రాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని పెద్దచెరువులను వెతుకులాడాల్సి వస్తోంది. దీంతో నిర్వాహకులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు.
మదనపల్లె విగ్రహాలకు సీటీఎం పెద్దచెరువే దిక్కు
మదనపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన 10 అడుగులకు పైగా ఎత్తైన విగ్రహాలను గతంలో పట్టణ శివారులోని తట్టివారిపల్లెచెరువు, స్వామిచెరువులో నిమజ్జనం చేసేవారు. కాని ఈసారి ఈ రెండు చెరువులు ఎండిపోయి చిన్ననీటి కుంటలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ కుంటల్లో పెద్ద విగ్రహాలు అసలు మునగవు. దీంతో నిర్వాహకులు మదనపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలోని సీటీఎం పెద్దచెరువులో నిల్వ ఉన్న నీటిలో నిమజ్జనం చేయాల్సి వస్తోంది. కాగా సోమల మండలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు నిమజ్జనాలకు కరువు అయ్యింది. కరకమంద గ్రామంలో ఏర్పాటు చేసిన ఎత్తైన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సమీపంలోని చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. తీరా అక్కడ చూస్తే చెరువులో చుక్క నీరు కూడా లేదు. దీంతో నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలను చెరువులోని బీడు భూమిలోనే వదిలేసి వెళ్లిపోయారు. చిన్న సోమల బొజ్జమల్లయ్య కుంట, తిరుపతి రోడ్డులోని కరకమంద అనంతరాయ చెరువు, ఎర్రంవారిపల్లెలోని బసివినాయుని కుంట, అడుసుపల్లె జీడిరేవుల వంకలో విగ్రహాలు దయనీయంగా దర్శనమిస్తున్నాయి.