ఆర్‌డీఎ్‌సఎస్ పనుల వేగమెక్కడ?
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:09 AM
త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందించడానికి జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎ్‌సఎస్ పనుల్లో వేగం లేదని అధికారులపై ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం
చిత్తూరు రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పల్లెలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందించడానికి జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎ్‌సఎస్ పనుల్లో వేగం లేదని అధికారులపై ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గిరింపేటలోని ఎస్‌ఈ కార్యాలయంలో కన్‌స్ట్రక్షన్, ఎంఆర్‌టీ, డీపీఈ విభాగాల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మార్చి నాటికి 421 ఫీడర్ల సంబంధించిన పనులు పూర్తి చేయాలని లక్ష్యం ఉందన్నారు. ఇప్పటి వరకు 174 మాత్రమేనని పూర్తి చేశారని, మిగిలిన వాటిని ఎప్పుటికి పూర్తిచేస్తారని ప్రశ్నించారు. మార్చి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. వాణిజ్య సర్వీసులకు స్మార్ట్‌మీటర్లు అమర్చడం పూర్తయిందని, రెండో దశలో ప్రభుత్వ కార్యాలయాలకు, మూడో దశలో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు, ఆపై మిగిలిన సర్వీసులకు అమర్చాలని చెప్పారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు ఆయా డివిజన్ పరిధిలో అందుబాటులో ఉంచుకోవాలని, మరమ్మతులకు గురైన 24 గంటల్లోపు మార్చాలన్నారు. నగరి, కార్వేటినగరం నియోజకవర్గాలకు ఆయా ప్రాంతాల్లోనే ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రతిసారి చిత్తూరుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సమావేశంలో ఈఈలు హరి, భాస్కర నాయుడు, రవి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.