Share News

నిర్మాణాలపై నిఘా ఏదీ?

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:57 AM

తిరుపతి నగరంలో ఆశాశహర్మ్యాలు ఇటీవల ఎక్కువయ్యాయి. పెరుగుతున్న నగరానికి ఇవి కూడా అవసరం. అయితే నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయా? అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారా? వంటి ప్రశ్నలు తాజాగా జరిగిన క్రేన్‌ ప్రమాదంతో ఉత్పన్నమవుతున్నాయి. డీబీఆర్‌ ఆస్పత్రి రోడ్డులో 13 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి పునాదులు తీస్తుండగా క్రేన్‌ కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందడం, పలువురు గాయపడడం పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.

నిర్మాణాలపై నిఘా ఏదీ?

పర్యవేక్షణ గాలికి.. ప్రాణాలు గాల్లోకి!

సస్పెన్షన్‌తోనైనా మార్పు వచ్చేనా?

తిరుపతిలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

- తిరుపతి సిటీ,ఆంధ్రజ్యోతి

తిరుపతి నగరంలో ఆశాశహర్మ్యాలు ఇటీవల ఎక్కువయ్యాయి. పెరుగుతున్న నగరానికి ఇవి కూడా అవసరం. అయితే నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయా? అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారా? వంటి ప్రశ్నలు తాజాగా జరిగిన క్రేన్‌ ప్రమాదంతో ఉత్పన్నమవుతున్నాయి. డీబీఆర్‌ ఆస్పత్రి రోడ్డులో 13 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి పునాదులు తీస్తుండగా క్రేన్‌ కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందడం, పలువురు గాయపడడం పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన నగరపాలక సంస్థ కమిషనర్‌ జయకృష్ణ టౌన్‌ప్లానింగ్‌ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించిందని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ చర్యలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందా? నగరంలో జరుగుతున్న ఇతర భారీ నిర్మాణాల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఫ అనుమతులు ఒకలా... నిర్మాణం మరోలా

నగరంలో ఇటీవల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం సమర్పించే ప్లానింగ్‌ మ్యాపుల్లో ఒకలా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణాలకు మధ్య వ్యత్యాసాలు ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెట్‌బ్యాక్స్‌ వదలకుండా అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలను పక్కనపెట్టి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నిర్మాణ అనుమతులు జారీ చేసిన అనంతరం పనుల పురోగతిని పరిశీలించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ మామూళ్ల మత్తులో మౌనమా?

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కొందరు అధికారులు అక్రమ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా విన్పిస్తున్నాయి. మామూళ్లకు అలవాటుపడి క్షేత్రస్థాయి పర్యవేక్షణను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తాజాగా చోటుచేసుకున్న ప్రమాదం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

ఫ నిరంతర పర్యవేక్షణ అవసరం

భవన నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలకే కాకుండా చుట్టుపక్కల ప్రజల భద్రతకు కూడా ముప్పుగా పరిణమించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో నగరంలోని బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు, నిర్మాణ నిబంధనలు, భద్రతా ప్రమాణాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచిస్తున్నారు. అధికారుల సస్సెన్షన్‌తోనే సరిపెట్టకుండా, నిర్మాణ అనుమతుల నుంచి పనులు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే మరో ఘోర ప్రమాదం జరిగే వరకు యంత్రాంగం మేల్కొనే పరిస్థితి ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 01 , 2026 | 01:57 AM