నాడి చూసే నాథుడేరీ?
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:23 AM
జిల్లా ఆస్పత్రిని పీడిస్తున్న వైద్యుల కొరత రోగులకు అందని కనీస సేవలు కీలక కేసులు ఇతర ఆస్పత్రులకు రెఫర్ నేటికీ డీఎంఈ పరిధిలోనే నియంత్రణ
మదనపల్లె క్రైం, జూలై 25(ఆంధ్రజ్యోతి): మదనపల్లెకు మంజూరైన మెడికల్ కళాశాల రద్దయినా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కంట్రోల్లోనే జిల్లా ఆస్పత్రి నడుస్తోంది. వైద్యులు తక్కువగా ఉండి, మిగతా సిబ్బంది ఎక్కువగా ఉండటంతో రోగులకు కనీస సేవలు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చిన కేసులన్నీ రెఫర్ చేసేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం మదనపల్లెకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో అప్పట్లో జిల్లా ప్రభుత్వాస్పత్రి భవనాలపై కళాశాల నిర్వహణ కోసం తాత్కాలిక గదులు నిర్మించారు. పైన, కింద మొత్తం 650 పడకలు ఏర్పాటు చేసి, 84మంది డాక్టర్లు, ప్రొఫెసర్స్, 90మంది స్టాఫ్‌నర్సులు, 90మంది పారిశుధ్య కార్మికులు, 30మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ల్యాబ్, డ్రగ్ మెయిన్ స్టోర్, మందుల దుకాణం, ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్, ఓటీ, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, ఆఫీస్ సబార్డినేటర్స్, కంప్యూటర్, డేటా ఆపరేటర్స్‌తో పాటు ఆయా విభాగాల్లో పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 150మందికి పైగా రిక్రూట్ చేశారు.
కళాశాల రద్దుతో డాక్టర్ పోస్టులు ఖాళీ
కొన్ని రోజుల తర్వాత మెడికల్ కళాశాల రద్దు కావడంతో 80మంది వైద్యుల్లో 67మంది వేరే ఆస్పత్రులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 17మంది మాత్రమే ఉన్నారు. అందులో కొన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు ఒక్కరు కూడా లేరు. ఆస్పత్రిలో వైద్యులు తప్పా..మిగతా సిబ్బంది అలాగే కొనసాగుతున్నారు. డీఎంఈ కంట్రోల్లో 330పడకలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)గా పేరుమార్చి పాలన సాగిస్తున్నారు. సీనియర్ డాక్టర్లు, ప్రొఫెసర్స్ అందరూ వెళ్లిపోవడంతో అరకొర వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వారితో పాటు సీనియర్ అసిస్టెంట్లు, ఆస్పత్రి పాలనాధికారులు కూడా ఇతర ఆస్పత్రులకు వెళ్లిపోయారు. గతంలో జిల్లా ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ కంట్రోల్లో ఉండేది. అప్పట్లో అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మసి్‌స్టలు, ఇతర వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేవారు. దాంతో రోగులకు అన్ని వసతులతో కూడిన మెరుగైన సేవలు అందేవి. కళాశాల రన్నింగ్‌లో లేకపోయినా అదే తరహాలో పాలన సాగిస్తూ రోగులను ఇబ్బంది పెడుతున్నారు.
పెరుగుతున్న మరణాలు
ఆస్పత్రిలో కేసులన్నీ రెఫర్ చేస్తుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. అత్యవసర, మెటర్నిటీ కేసులు మృత్యువాతపడుతున్నాయి. అలాగే టెస్టింగ్ కిట్లు, మందుల కొరత ఉంది. కనీస సేవలు కూడా అందడం లేదు. దీంతో తిరుపతి, బెంగళూరు, వేలూరు సీఎంసీ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. గతంలో వామపక్ష, ప్రజాసంఘాలు ఆస్పత్రి ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకురావాల్సి ఉంది.
ఉన్నతాధికారులకు విన్నవించాం..
ఆస్పత్రి సమస్యలపై ఇదివరకే పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించాం. వైద్యుల కొరతతో పాటు అన్ని సమస్యలు ఉన్నాయి. దాంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. మరోసారి విన్నవిస్తాం.
- డాక్టర్ రాధిక, ఆర్‌ఎంవో, మదనపల్లె జిల్లా ఆస్పత్రి