ఈ వెతలు తీరేదెప్పుడు?
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:25 AM
తిరుపతి జిల్లాలో భూ సంబంధిత సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు నిజమైన పట్టా భూములను సైతం 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చడం, రీసర్వే ప్రక్రియలో భూములపై జాయింట్ పేర్లు నమోదు కావడం వంటి పరిణామాలు భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భూములను విక్రయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, రుణాలు పొందడం వంటి అవసరాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 22ఏ, రీసర్వేతో భూ యజమానుల కష్టాలు
ఆయన ఓ రిటైర్డ్ ఉద్యోగి.తిరుపతి రామచంద్ర నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 14యేళ్ల క్రితం డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొని నివాసం ఉంటున్నారు. కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది. బ్యాంకు రుణం కూడా ఇచ్చింది.అయితే ఫ్లాట్ అమ్మి కూతురు పెళ్లి చేయాలనుకున్నారు. అప్పటికే ప్రభుత్వం 22ఏ కింద పెట్టడంతో రిజిస్ట్రేషన్ కాకపోవడం వలన కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు వచ్చినా తక్కువ ధరకు అడుగుతున్నారు. రిటైరైన వయసులో రిజిస్ర్టేషన్ కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగి కలెక్టర్ నుంచి ప్రత్యేక ఉత్తర్వు కూడా తెచ్చుకున్నారు. అయినా పనికాలేదు.
ఫశ్రీకాళహస్తి మండలం పెనుబాక వద్ద నాలుగు ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గత ప్రభుత్వం రీసర్వే పేరిట చుక్కలు చూపించింది. నాలుగేళ్లుగా అధికారులకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నా ఫలితం రాలేదు. కూటమి ప్రభుత్వంలోనూ న్యాయం జరగలేదని వాపోతున్నారు
తిరుపతి సిటీ- ఆంధ్రజ్యోతి
తిరుపతి జిల్లాలో భూ సంబంధిత సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు నిజమైన పట్టా భూములను సైతం 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చడం, రీసర్వే ప్రక్రియలో భూములపై జాయింట్ పేర్లు నమోదు కావడం వంటి పరిణామాలు భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భూములను విక్రయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, రుణాలు పొందడం వంటి అవసరాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి వివాదాలు లేని పట్టా భూములు కూడా 22ఏ జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ భూ యజమానులు ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ పరిష్కారం ఆలస్యమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. రీ సర్వే లోపాలను సరిదిద్దడంతో పాటు 22ఏ జాబితాలో తప్పుగా నమోదైన భూములను వెంటనే తొలగించాలని భూ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఫ శ్రీకాళహస్తిలో రీసర్వే చిక్కులు
శ్రీకాళహస్తి మండలం పెనుబాక గ్రామ లెక్కదాఖలా సర్వే నెంబరు 159/ఏ-1లో 3.55 ఎకరాలు, 160/15బీలో 30 సెంట్లు, 160/17,18లో 37 సెంట్లు భూమి కాపుగంటి పద్మకు చెందినవి. 1919 నుంచి లింక్ డాక్యుమెంట్ కలిగిన ఈ భూమిని శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రార్ (1718/2008) కార్యాలయంలో ఆమె రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత 2014లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎం. వెంకట తీర్థ ఆమె నుంచి కొనుగోలు చేసి రిజిస్టర్ (3674/2014) చేసుకున్నారు. 1-బీలో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసుకుని, 535 నెంబరు పట్టా పాస్‌బుక్ కూడా పొందారు. 4.23 ఎకరాల భూమి గత 13 ఏళ్లుగా ఆయన స్వాధీనంలో ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో మరో ముగ్గురి పేర్లు కలిపి జాయింట్‌గా నమోదు చేశారు. దీనిని మరలా రీసర్వే చేసి స్కెచ్ మేరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి న్యాయం చేయాలని తిరుగుతూనే ఉన్నారు. ఈవిధంగా దాదాపు 200 మంది బాధిత కుటుంబాలు శ్రీకాళహస్తి మండలంలో ఉన్నట్టు సమాచారం.
ఫ పాకాలలో ఇంకో రకం పాట్లు
పాకాల మండలం దామలచెరువులో 2178 సర్వే నెంబరు నుంచీ 2180 వరకు దాదాపు 800 ఎకరాల గయాల పొరంబోకు భూమి ఉంది. అయితే 1950కి ముందే డీకేటీ పట్టాలు ఇచ్చారు. అప్పటినుంచి అనేక క్రయవిక్రయాలు జరిగిన ఈ భూముల్లో ఎక్కువగా మామిడి తోటలున్నాయి. అయితే వీటిని 22ఏలో పెట్టేశారు.75ఏళ్ల రికార్డు కలిగి, అనుభవంలో ఉన్న ఇలాంటి భూమిని 22ఏ నుంచి తొలగించాలని ప్రభుత్వం చెప్పినా అధికారుల చెవికెక్కడంలేదన్న విమర్శలున్నాయి. ఇందులోనే కొన్ని సర్వే నెంబర్లు తొలగించి, మరికొన్నింటిని అలాగే ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సర్వే నెంబరు 2180లో 14.80 సెంట్లు, 194/5బీ 3.80 సెంట్లు కొనుగోలు చేసినవారు నోషనల్ ఖాతా తొలగించి ఆన్‌లైన్‌లో పేరు చేర్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక అధికారి న్యాయం చేసేలోపు మరొక అధికారి బదిలీపై రావడంతో మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు.