Share News

కుప్పంలో అసలేం జరుగుతోంది?

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:03 AM

కుప్పం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. అసలు నియోజకవర్గ పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ముఖ్య నాయకులను అమరావతి రమ్మని ఆదేశించింది.

కుప్పంలో అసలేం జరుగుతోంది?

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాలపై సీరియస్‌

టీడీపీ ముఖ్య నాయకులకు అధిష్ఠానం పిలుపు

కుప్పం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కుప్పం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. అసలు నియోజకవర్గ పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ముఖ్య నాయకులను అమరావతి రమ్మని ఆదేశించింది. దీంతో ముఖ్య టీడీపీ నాయకులందరూ శనివారం మంగళగిరికి ఉన్నపళంగా బయల్దేరి వెళ్లారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు సాగిన ప్రసంగాల తీరు నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లేదన్న వాస్తవాన్ని బట్టబయలు చేసింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో మార్చి నెల 30వ తేదీన ‘కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది?’ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తా కథనం ప్రకంపనలు సృష్టించింది. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీఐఐసీ సభ్యుడు, కుప్పం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ ప్రసంగిస్తూ ముఖ్య నాయకులు తమ చుట్టూ ఉన్నవారి ప్రభావానికి లోనవుతున్నారని, వారికే ప్రాధాన్యమిస్తూ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిజంగా పనిచేసేవారు గ్రామాలలో సైలెంటుగా తమ పని తాము చేసుకు పోతున్నారని, వారిని గుర్తించి రాబోయే స్థానిక ఎన్నికల్లో అవకాశాలు ఇవ్వాలని డిమాండు చేశారు. పార్టీలో వైసీపీకి సహకరించే కోవర్టులున్నారని తీవ్ర అభియోగం మోపారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌, కడా రాజకీయ సలహా మండలి చైర్మన్‌ కంచర్ల శ్రీకాంత్‌ దీనిపై తీవ్రస్థాయిలో స్పందించారు. సభకు వచ్చిన వారితో సహా రాకుండా ఇళ్లదగ్గరే ఉండిపోయిన క్షేత్రస్థాయి పదవుల్లో ఉన్న నాయకులెవరూ పనిచేయడంలేదని ఫిర్యాదు చేశారు. కనీసం కేఎ్‌సఎ్‌సలుగా ఉన్న వారు కుటుంబాలను కలవడం లేదని, వారి సమస్యలు తెలుసుకోవడం లేదని ఆక్షేపించారు. టీ బంకులు, చెట్ల కింద కూర్చొని గాలిమాటలు విని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రేమ్‌కుమార్‌ 10 నిమిషాలు ప్రసంగించగా, ఎమ్మెల్సీ దాదాపు 40 నిమిషాలసేపు ఏకధాటిగా ప్రసంగించారు. అంతటితో ఊరుకోని నాయకులు తమ ప్రసంగాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. సభలో ప్రసంగాలు జరిగిన తీరుపై ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో అదేరోజు అక్కడినుంచి బాధ్యులైన నాయకులతోపాటు, ఇతర ముఖ్య నాయకులకు ఫోన్లు వచ్చాయి. కుప్పంలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లేకపోవడం నిజమేనా అని ఆరా తీశారు. తాజాగా అమరావతి రమ్మంటూ పిలుపు అందడంతో టీడీపీ ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకుల్లో గుబులు బయలుదేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల మధ్య, నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్నది అధిష్ఠానం అభీష్ఠంగా చెబుతున్నారు. కుప్పం నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సమావేశం కానున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పిలుపు అందడంతోనే శనివారంనాడు పిలుపువచ్చిన నాయకులందరూ హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ జి.మునిరాజు, రెస్కో చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నవారు అమరావతికి వెళ్లిన వారిలో ఉన్నారు. చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో తమలో ఎవరికి ఏం మూడుతుందో, మందలింపులు, హెచ్చరికలు ఎవరు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన అమరావతి బయల్దేరిన నాయకుల్లో గూడుకట్టుకుంది.

Updated Date - Apr 05 , 2026 | 01:03 AM