Share News

అసలేం జరిగింది?

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:15 AM

రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ నియమించిన విచారణ కమిటీ మంగళవారం ఆయన్ను విచారించింది.

అసలేం జరిగింది?
త్రీమెన్‌ కమిటీ సభ్యులు శివశంకర్‌, రమాదేవి, వరుణ్‌, విచారణకు వెళుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

లైంగిక ఆరోపణలపై ఎమ్మెల్యే శ్రీధర్‌ను విచారించిన త్రీ మెన్‌ కమిటీ

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ నియమించిన విచారణ కమిటీ మంగళవారం ఆయన్ను విచారించింది.ఆరోపణలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేని జనసేన కార్యక్రమాలకు ఏడు రోజుల పాటు దూరంగా ఉండాలని, కమిటీ ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ నిమిత్తం త్రీమెన్‌ కమిటీ సభ్యులు శివశంకర్‌, రమాదేవి, వరుణ్‌ రైల్వేకోడూరుకు చేరుకుని రాజ్‌ కన్వెన్షన్‌ హాల్లో దిగారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ను సుమారు గంటపాటు విచారించారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు మండలాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు 34 మందిని లోపలకు అనుమతించారు.ఎమ్మెల్యే శ్రీధర్‌ను విచారించిన తర్వాత జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను విచారించారు. ఆ తర్వాత నాయకులను, కార్యకర్తలను త్రీమెన్‌ కమిటీ విచారించింది.ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5.45 గంటలకు ముగిసింది.తరువాత ఎమ్మెల్యేని పిలిపించి చాలా సేపు కమిటీ విచారించింది. విచారణలో ఎక్కువ మంది రైల్వేకోడూరులో జనసేన ఇబ్బందికర పరిస్థితుల్లో పడిందని, దీన్ని చక్కదిద్దాలని చెప్పినట్లు తెలిసింది.పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ బలోపేతం మాట అటుంచి మరింత ప్రమాదంలో పడే అవకాశముందని నాయకులు చెప్పినట్లు సమాచారం.

నా దగ్గరున్న ఆధారాలను కమిటీకి అందజేశా

వంద కేసులు పెట్టినా తన దగ్గరున్న ఆధారాలతో పోరాడతానని ఎమ్మెల్యే శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.నాపై ఎవరైతే ఆరోపణలు చేశారో అది పూర్తిగా వ్యక్తిగతమన్నారు. పార్టీపై జరిగిన విషయాన్ని రుద్దకుండా ఉండాలన్నారు. తాను వ్యక్తిగతంగానే కమిటీకి కూడా వివరణ ఇచ్చామని తెలిపారు.పూర్తి ఆధారాలను కమిటీకి ఇవ్వడం జరిగిందన్నారు. కమిటీ నిర్ణయం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి పూర్తి వివరాలను తెలియజేస్తానన్నారు.త్రీ మెన్‌ కమిటీలో సభ్యుడైన టీసీ వరుణ్‌ మాట్లాడుతూ విచారణ పారదర్శకంగా విచారణ సాగిందన్నారు.విచారణ సమగ్ర నివేదిక పార్టీ అధిష్ఠానానికి అందిస్తామని తెలిపారు.ఈ విషయంలో తుది నిర్ణయం పవన్‌కళ్యాణ్‌దే అన్నారు.

కమిటీ ముందుకు పంపలేదని గొడవ

విచారణ కమిటీ ముందుకు తమను పంపలేదని జనసేన సీనియర్‌ కార్యకర్తలు ఉత్తరాది శివకుమార్‌, మర్రిరెడ్డి ప్రసాద్‌, సింగిరి శివమ్మ తదితరులు గొడవ చేశారు.దీంతో కమిటీ సభ్యులు తమ ప్రతినిధులను పంపించి వారి పేర్లను నమోదు చేశాక కమిటీ ముందుకు అనుమతించారు. కాగా నాలుగు రోజుల కిందటే రైల్వేకోడూరు అసలేం జరిగిందన్న సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం తెప్పించుకున్నట్లు సమాచారం.విచారణ జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుని కమిటీని రైల్వేకోడూరుకు పంపింది.

Updated Date - Feb 04 , 2026 | 02:15 AM