కల్తీపురుగు మందులకు కళ్లెమేదీ?
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:50 AM
కల్తీ,నాసిరకం పురుగుమందుల విక్రయాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైల్వేకోడూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కల్తీ,నాసిరకం పురుగుమందుల విక్రయాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభాపేక్షతో కొందరు వ్యాపారులు అంటగడుతున్న మందులు వాడి వీరునష్టాల బారిన పడుతున్నారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో దాదాపు 22వేల ఎకరాల్లో మామిడి పండిస్తున్నారు. ప్రధానంగా బేనీషా, తోతాపూరి, నీలం,ఇమాంపసందు, రుమాణి, మల్లిక, ఖాదర్, చెరుకురసం, కాలేపాడు, స్వర్ణజహంగీర్, పులిహోరా, అల్లీపసందు, రాయల్‌స్పెషల్ తదితర రకాల కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. బేనీషా, ఖాదర్, నీలం, తోతాపూరి రకాలను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇటీవల నాసిరకం క్రిమిసంహారక మందులను పిచికారి చేయడంతో కాయల్లో పురుగుమందుల అవశేషాలు కనిపిస్తున్నాయి. దీంతో అవి ఎగుమతికి పనికిరాకుండా పోతున్నాయి. వేపనూనె,ఆర్గానిక్ మందులు పిచికారి చేసిన తోటల్లో పూత బాగానే వస్తోంది. సర్టిఫైడ్ కంపెనీలు సూచించిన మందులను వాడితే ఎగుమతులు ఇబ్బంది ఉండదు. కానీ చిన్న, చిన్న కంపెనీల ఎరువులు, పురుగు మందులను ఈ ప్రాంతంలో ఎక్కువగా విక్రయిస్తున్నారు. అవికాస్తా వికటించి మామిడి, బొప్పాయి, అరటి, తమలపాకు, దోస, కర్భూజ రైతులను నష్టాల్లో ముంచెత్తుతున్నాయి.
మొక్కుబడిగా దుకాణాల తనిఖీ
రైల్వేకోడూరులో ఎరువులు, పురుగుమందుల. దుకాణాల్లో తూతూమంత్రంగా తనిఖీలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బాపై రూ.100 ధర ఉంటే రూ.200లకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూరియాను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారని,బడా రైతులకు మాత్రమే ఇస్తున్నారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందులు తీసుకున్నాక బిల్లులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. టాటా, సెన్‌జెంటా, బేయర్, సర్టిఫైడ్ కంపెనీలు అమ్మే పురుగు మందుల్లో వ్యాపారులకు ఎక్కువగా మార్జిన్ ఉండదు. మార్జిన్ కక్కుర్తితో చిన్నచిన్న కంపెనీల ఎరువులు, పురుగు మందులనే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వీటిని మామిడి, అరటి, బొప్పాయి, తమలపాకు రైతులపై రుద్దుతున్నారు. దీంతో అన్నదాతలు నష్టపోయి లబోదిబోమంటున్నారు. ఓబనపల్లెకు చెందిన ఓ రైతు దోస తోటకు ఒక మందును పిచికారి చేయడంతో కాయలు మొత్తం దెబ్బతిన్నాయి. బాధితరైతు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికైనా నాణ్యత ఎరువులు, పురుగు మందులను విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.