కృష్ణగిరిలో మామిడి ధర ఎంత?
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:43 AM
పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో రైతులకు తోతాపురి మామిడికి చెల్లిస్తున్న ధరపై క్షేత్రస్థాయిలో ఉద్యానవన మార్కెటింగ్ బృందాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో రైతులకు తోతాపురి మామిడికి చెల్లిస్తున్న ధరపై క్షేత్రస్థాయిలో ఉద్యానవన మార్కెటింగ్ బృందాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సోమవారం రాత్రి ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులతో తోతాపురి మామిడికాయకు చెల్లించాల్సిన గిట్టుబాటు ధర అంశంపై కలెక్టర్ సమీక్షించారు. గిట్టుబాటు ధర చెల్లింపుపై మామిడి రైతులు, సంఘ నాయకుల డిమాండ్లు, ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణలోకి తీసుకొని త్వరలో పరిష్కారమార్గాలు అన్వేషించాలని సూచించారు. జిల్లాలో 31 మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ, 14 మాత్రమే రైతుల నుంచి తోతాపురి మామిడి కొంటున్నాయన్నారు. మిగిలిన ఫ్యాక్టరీలు కూడా ముందుకు వచ్చేలా వాటి యజమానులను ఒప్పించాలని చెప్పారు. గుజ్జు ఫ్యాక్టరీ వద్ద రైతులకు చెల్లించే కిలో ధరను నోటీసు బోర్డు ద్వారా ప్రతిరోజు నమోదు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీల వద్ద నిఘా ఉంచాలని తహసీల్దార్లకు చెప్పారు. మంగళవారం నుంచి రెండు శాఖల అధికారులు ఫ్యాక్టరీలలో పరిశీలించి రైతులకు ఎలాంటి సమస్యలు కలగకుండా చూడాలన్నారు. ర్యాంపుల వద్ద, రైతులు నేరుగా ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేస్తే ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉద్యాన శాఖ డీడీ సతీష్, కోటేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.