ఎస్‌ఎ్‌సలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:50 AM
సమగ్రశిక్షలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ), మోడల్ స్కూళ్లలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ నెల మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, 11లోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. నాన్ టీచింగ్‌కు సంబంధించి కేజీబీవీల్లో 22, మోడల్ స్కూళ్లలో 12 ఉద్యోగాలకు ఏకంగా 712 దరఖాస్తులు వచ్చాయి.
ఖాళీ పోస్టుల భర్తీకి అందని మార్గదర్శకాలు
నకిలీ వెబ్‌సైట్‌పై కేసు నమోదుకు చర్యలు
చిత్తూరు సెంట్రల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్షలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ), మోడల్ స్కూళ్లలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ నెల మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, 11లోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. నాన్ టీచింగ్‌కు సంబంధించి కేజీబీవీల్లో 22, మోడల్ స్కూళ్లలో 12 ఉద్యోగాలకు ఏకంగా 712 దరఖాస్తులు వచ్చాయి. కేజీబీవీలోని 22 పోస్టులకు 461 దరఖాస్తులు, మోడల్ స్కూళ్లలోని 12 ఉద్యోగాలకు 251 వచ్చాయి. వీటి పరిశీలన ప్రక్రియ పూర్తి చేసినా, ఇప్పటి వరకు పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో పోస్టుల భర్తీ ఎప్పుడు చేపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి నోటిఫికేషన్ జారీ సమయంలోనే మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. లేని పక్షంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూరైన వెంటనే భర్తీ ఎలా చేయాలనే దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి వారం రోజులు కావస్తున్నా మార్గదర్శకాలు రాలేదని సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు
ఒక్క పోస్టుకు సుమారు 20 మంది చొప్పున పోటీ పడుతున్న క్రమంలో రాష్ట్ర సమగ్రశిక్ష అధికారులు జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు రాకుండానే, ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను సమగ్రశిక్ష అధికారులకు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో అర్హతలున్న అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వస్తాయా? రావా? అనే సందేహపడుతున్నారు. దీనిపై సమగ్రశిక్ష ఏపీసీ వెంకట రమణను అడగ్గా పోస్టుల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలు వస్తే వాటిని అనుసరిస్తూ కలెక్టర్ సూచనల మేరకు ప్రక్రియ పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు.పుకార్లను నమ్మి ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదన్నారు.
నకిలీ వెబ్‌సైట్‌తో సంబంధం లేదు
సర్వశిక్ష అభియాన్‌లో పేరుతో ఉద్యోగాలిస్తామంటూ ఓ నకిలీ వెబ్‌సైట్ హల్‌చల్ చేయడంపై కలెక్టర్ సుమిత్ కుమార్ వెంటనే స్పందించారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఆయన సర్వశిక్ష అభియాన్ డాట్‌కామ్ జాబ్స్, పీహెచ్‌పీ అనే వెబ్‌సైట్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ కాదన్నారు. దీనిపై సమగ్రశిక్షకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరో వైపు ఈ వెబ్‌సైట్ దారులపై కేసు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఏపీసీ తెలిపారు.