Share News

కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:42 AM

కుప్పం తెలుగుదేశం పార్టీలో అంతా సవ్యంగానే జరుగుతోందా? నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉందా? కుప్పంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సాగిన ప్రసంగాలు ఈ ప్రశ్నలకు సమాధానం ‘లేద’నే రీతిలోనే సాగాయి.

కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది?
కుప్పంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ప్రతిన చేస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల తదితరులు

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆరోపణల పర్వం

కుప్పం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కుప్పం తెలుగుదేశం పార్టీలో అంతా సవ్యంగానే జరుగుతోందా? నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉందా? కుప్పంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సాగిన ప్రసంగాలు ఈ ప్రశ్నలకు సమాధానం ‘లేద’నే రీతిలోనే సాగాయి. తమ చుట్టూ తిరిగేవారినే నాయకులు అందలం ఎక్కిస్తున్నారని ఏపీఐఐసీ డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ పరోక్ష ఆరోపణలు చేయగా, గాలి మాటలు విని ఏదంటే అది మాట్లాడి పార్టీకి, చంద్రబాబుకు ద్రోహం చేయొద్దంటూ ఎమ్మెల్సీ కంచర్ల ఆవేశపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

కుప్పంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీఐఐసీ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ, నాలుగు రోజులపాటు జరిగిన భువనేశ్వరి పర్యటనలో కొంతమంది క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆమెతో మాట్లాడడానికి అవకాశం లభించలేదన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల చుట్టూ చేరిన కొందరు, పార్టీకోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కకుండా ఆయన్ను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డుమీదకొచ్చి ఎన్నో కష్టాలకోర్చి చంద్రబాబుకోసం నిలబడ్డ వారికి మొదటి స్థానం ఇవ్వాలని డిమాండు చేశారు. ‘కార్యకర్తలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నారు. మన నాయకుడికి ఓట్లు తగ్గాయంటే నాలాంటి.. మీలాంటి నాయకుల వల్లే’నంటూ వేదికపై నాయకులను చూపించడంతో సభలోనుంచి విజిళ్లు, చప్పట్లు మోగాయి. కష్టపడ్డ కార్యకర్త గ్రామాల్లో సైలెంట్‌గా పనిచేసుకు పోతుంటాడని, జనంలో బలంలేని వారే నాయకుల చుట్టూ తిరుగుతుంటారని ఆక్షేపించారు. ఎవరితోనైనా సమస్య ఉందనిపిస్తే నేరుగా పిలిపించి మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందని విజ్ఞప్తి చేశారు. పార్టీలో వైసీపీకి సహకరించే కోవర్టులపై చర్యలు తీసుకోవాలన్నారు. చుట్టూ తిరిగేవారికి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని గుర్తించి రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ టికెట్లు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఒక్కరే మన నాయకుడని, పార్టీలో క్రమశిక్షణ, నాయకుల మధ్య సమన్వయం, ఐకమత్యం లేకపోతే నాయకుడికి, పార్టీకి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు ద్రోహం చేయొద్దు

ప్రేమ్‌కుమార్‌ ప్రసంగానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ తీవ్రంగా స్పందించారు. ‘అందరం పనిచేసేది మన నాయకుడు చంద్రబాబు కోసమే. నాయకులపైనా, తోటి వ్యక్తులపైనా తప్పుడు ప్రచారాల వల్ల నష్టం జరిగేది మన పార్టీకి. గాలి మాటలు విని, చంద్రబాబుకు ద్రోహం చేయొద్దు’ అని హెచ్చరించారు. ‘ఈ ఆవిర్భావ సభకు పిలిచింది ఏదో స్థాయిలో పదవులు ఉన్నవారిని మాత్రమే. మీరు నాయకులు కారా? మీలో ఎంతమంది బాధ్యతగా ఈ సభకు వచ్చారు?’ అంటూ ప్రశ్నించారు. కేవలం 535 మందే వచ్చారన్నారు. కుటుంబ సాధికార సభ్యుల్లో ఎంతమంది తమకు కేటాయించిన కుటుంబాలను కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారంటూ నిలదీశారు. ‘విజల్స్‌ వెయ్యడం, చప్పట్లు కొట్టడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. చెప్పడం కాదు, చెయ్యడం చాలా ముఖ్యం’ అని ప్రతిస్పందించారు. టీ బంకుల్లో, చెట్లకింద నలుగురిలో చేరి మన గురించే మనం తప్పుడు మాటలు మాట్లాడుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు ఒక్కరే అందరికీ నాయకుడని, ఇక్కడేం జరుగుతున్నదో, కష్టపడే వారెవరో, ఎవరికి పదవులివ్వాలో ఆయనకు తెలుసునన్నారు. ‘మీరు పార్టీకోసం చొక్కాలు చింపుకోవద్దు. గొంతులు కోసుకోవద్దు. నిమ్మకాయ కూడా కొయ్యొద్దు. కనీసం గ్రామాలలో కుటుంబాలను కలిసి వారి నిజమైన సమస్యలు తెలుసుకోండి. ఆ సమస్యలు పరిష్కరించగలిగితే ఏ ఎన్నికలైనా విజయానికి ఢోకా ఉండదు’ అని పిలుపునిచ్చారు. తనతో సహా తప్పు చేస్తే ఏ నాయకుడినైనా చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుందని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.

Updated Date - Mar 30 , 2026 | 12:42 AM