Share News

ఇన్నాళ్లు ఏం చేశారు?

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:44 AM

చిత్తూరులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ జేసీ, డీసీ కార్యాలయాలను తిరుపతికి తరలించడంపై వైసీపీ నాయకులు సోమవారం చిత్తూరులో ఆ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయాలు తరలించి దాదాపు 25 రోజులు దాటాక ఆందోళనకు దిగడం గమనార్హం.

ఇన్నాళ్లు ఏం చేశారు?
చిత్తూరు కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైసీపీ నాయకులు

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ జేసీ, డీసీ కార్యాలయాలను తిరుపతికి తరలించడంపై వైసీపీ నాయకులు సోమవారం చిత్తూరులో ఆ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయాలు తరలించి దాదాపు 25 రోజులు దాటాక ఆందోళనకు దిగడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు కార్యాలయాలను తిరుపతికి తరలించాలనే ప్రతిపాదన కొత్తది కాదని అధికారులు చెబుతున్నారు. 2024 మార్చి 6వ తేదిన అప్పటి వైసీపీ ప్రభుత్వంలోనే జీవో జారీ అయింది. అప్పట్లో వ్యతిరేకత వ్యక్తంకావడంతో తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా ఆపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా కార్యాలయాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నెల కిందట జేసీ, డీసీ కార్యాలయాలను తిరుపతికి తరలిస్తూ జీవో జారీ చేసింది. అధికారులు, సిబ్బందిని తరలించి ఇప్పటికే 25 రోజులు గడిచిపోయాయి. అయితే జీవో జారీ అయినప్పుడు, తరలింపు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, చివరకు కార్యాలయాలు తిరుపతికి వెళ్లినప్పుడు స్పందించని వైసీపీ నాయకులు.. ఇప్పుడు ధర్నాకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయాల తరలింపును అడ్డుకునేందుకు కనీసం అప్పట్లోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఏదైనా ఉపయోగం ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం కార్యాలయాల తరలిపోయి, అధికారులు, సిబ్బంది తిరుపతిలో విధులు నిర్వహిస్తున్న తర్వాత ఆందోళన చేయడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులపై నిజంగానే అంత అభిమానం ఉండుంటే ముందుగానే స్పందించే వారని.. ఇప్పుడు ఆందోళన చేయడం వెనుక వారి రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 19 , 2026 | 01:44 AM