జీడీనెల్లూరులో కూటమికి ఏమైంది?
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:28 AM
జిల్లాలో వైసీపీకి వచ్చిన జడ్పీటీసీ స్థానాలు నాలుగు. మూడు మండలాల్లో కూటమికన్నా ఎక్కువ మంది ఎంపీటీసీలు గెలవడంతో, ఎంపీపీ పదవులకు మెజారిటీ లభించింది. ఈ విజయాలను ఒక్క గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోనే వైసీపీ దక్కించుకుంది.
గ్రూపులు.. ఎమ్మెల్యే థామస్ తీరుపై వ్యతిరేకతే కారణమా?
చిత్తూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైసీపీకి వచ్చిన జడ్పీటీసీ స్థానాలు నాలుగు. మూడు మండలాల్లో కూటమికన్నా ఎక్కువ మంది ఎంపీటీసీలు గెలవడంతో, ఎంపీపీ పదవులకు మెజారిటీ లభించింది. ఈ విజయాలను ఒక్క గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోనే వైసీపీ దక్కించుకుంది. ఏ నియోజకవర్గంలోనూ లేనివిధంగా ఇక్కడే కూటమి ఎందుకు ఓటమి చెందింది? ఈ ప్రశ్నకు టీడీపీలో ఉన్న గ్రూపులు.. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకతే కారణమన్న సమాధానం వస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ రెండు, మూడు గ్రూపులున్నాయి. ఓ వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉంటే.. మరో వర్గం వారు పనిచేయలేదు. రానున్న సర్పంచి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు.. స్థానిక వైసీపీ నాయకులతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు మేం వదిలేస్తాం, సర్పంచి ఎన్నికల్లో మాకు వదిలేయాలనే ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే థామస్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం, ఆయన తీరు నియోజకవర్గ నాయకులకు నచ్చకపోవడం, ఆయన చుట్టూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారే ఉండడం వంటి కారణాలు కూడా శ్రేణుల్లో అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనూ ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టలేదని, స్థానిక నాయకులతో చర్చించి ఎంపిక చేసుంటే ఫలితం మరోలా ఉండేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి కంచుకోట అయిన పెనుమూరులో జడ్పీటీసీతో పాటు ఎంపీపీ పదవినీ కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడి జడ్పీటీసీ అభ్యర్థి కార్జాల అరుణకు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు సహకరించలేదన్న ఆరోపణలున్నాయి. వెదురుకుప్పం, ఎస్ఆర్పురం మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు వైసీపీకి దక్కగా, కార్వేటినగరం జడ్పీటీసీ కూడా వైసీపీకే దక్కింది. జీడీనెల్లూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థికి 304 ఓట్ల మెజారిటీనే రావడం గమనార్హం.