Share News

ఏమనుకుంటున్నావ్‌.. కాల్చి పడేస్తా!

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:47 AM

అటవీ సమీప ప్రాంతాల్లోని పలువురు జంతువుల నుంచి ప్రాణ రక్షణ కోసం లైసెన్స్‌డ్‌ కంట్రీమేడ్‌ తుపాకులను తీసుకుంటారు. మనుషులు, మూగజీవాలపై క్రూర మృగాలు దాడులకు పాల్పడితే.. వాటి నుంచి కాపాడుకోవడానికి వీటిని వాడుకోవాలి. అందుకని వీరు తుపాకుల కోసం దరఖాస్తు చేసుకుంటారు.

ఏమనుకుంటున్నావ్‌.. కాల్చి పడేస్తా!
కాల్చింది ఈ నాటుతుపాకీతోనే

కొందరు ప్రాణరక్షణకని తీసుకున్న లైసెన్డ్‌ తుపాకులను ఎక్కుపెడుతున్న వైనం

తాజాగా నాటుతుపాకీ పేల్చి యువకుడి మృతి

చిత్తూరు అర్బన్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): అటవీ సమీప ప్రాంతాల్లోని పలువురు జంతువుల నుంచి ప్రాణ రక్షణ కోసం లైసెన్స్‌డ్‌ కంట్రీమేడ్‌ తుపాకులను తీసుకుంటారు. మనుషులు, మూగజీవాలపై క్రూర మృగాలు దాడులకు పాల్పడితే.. వాటి నుంచి కాపాడుకోవడానికి వీటిని వాడుకోవాలి. అందుకని వీరు తుపాకుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అక్కడి పరిస్థితులను ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు పరిశీలించి అనుమతులిస్తారు. తుపాకులు తీసుకున్న వారు తమ పూర్తి వివరాలను ఆయా స్టేషన్లలో ఇవ్వాలి. ఇలా ప్రాణరక్షణకని తీసుకునే లైసెన్డ్‌ తుపాకులను తీసుకుని కొందరు భూ తగాదాలు, ఇతరత్రా కారణాలతో ప్రత్యర్థులపైకి ఎక్కిపెడుతున్నారు. కాల్చిపడేస్తానంటూ బెదిరిస్తున్నారు. తాజాగా చిత్తూరులో నాటు తుపాకీతో ఓ యువకుడిని హతమార్చారు. జిల్లాలో గతంలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే..

2023లో యాదమరి మండలం మాదిరెడ్డిపల్లెలో సురేష్‌ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు భూమి విషయంలో తగాదాపడ్డారు. ఘర్షణ పెద్దదవ్వడంతో సురే్‌షపై కాల్పులు జరిపారు. ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం చిత్తూరు కోర్టులో కేసు నడుస్తోంది.

ఓ యువతి ఫోన్‌ నెంబర్‌ అడిగితే ఇవ్వలేదని, తనను ప్రేమించలేదనే కోపంతో ఆమె ఇంటిపై బైరెడ్డిపల్లె మండలం కడపనత్తం గ్రామానికి చెందిన చాన్‌బాష కాల్పులు జరిపాడు. ఆ యువతినే కాకుండా కుటుంబం మొత్తాన్ని తుద ముట్టించాలని అర్ధరాత్రి ఈ కాల్పులు జరిపాడు. వాళ్లతా ఇంటి లోపల ఉండిపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

తాజాగా చిత్తూరు మండలం తుమ్మిందపాళ్యకు చెందిన సాయికుమార్‌, ఢిల్లీబాబు దాయాదులు. మద్యం మత్తు మత్తులో బుధవారం డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో సాయికుమార్‌ను ఢిల్లీబాబు నాటు తుపాకీతో కాల్చడంతో అక్కడిక్కడే చనిపోయారు.

రెండో రోజుల్లో చెల్లెలి పెళ్లి ఉండగా..

తనకు సోదరుడైన సాయికుమార్‌కు ఢిల్లీబాబు నాటు తుపాకీ కొనిచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు. సాయికుమార్‌ను బుధవారం కాల్చి చంపింది ఆ తుపాకీతోనేనట. కాగా, వీరిద్దరూ రాత్రిళ్లు కలిసి అడవికి వేటకు వెళ్లేవారని తెలుస్తోంది. నగదు లావాదేవీల గొడవ హత్యకు దారితీసింది. ఏమైనప్పటికి తాను కొనిచ్చిన తుపాకీతోనే.. సాయికుమార్‌ ప్రాణం పోయింది. సాయికుమార్‌ చెల్లెలికి మరో రెండు రోజుల్లో పెళ్లి జరగనుంది. ఇంతలో ఈ ఘటన జరగడంతో ఆ ఇంట విషాదం చోటు చేసుకుంది.

- చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 05 , 2026 | 12:48 AM