కూతురికి పెళ్లి చీర తెస్తానని వెళ్లి..
ABN , Publish Date - May 21 , 2026 | 01:54 AM
ఆ కుటుంబం పెళ్లి హడావుడిలో ఉంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్నారు. కూతురికి పెళ్లి చీర తెస్తానని చెప్పి వెళ్లిన తండ్రి చెరువులో పడి మృతిచెందడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.
విషాదంలో కుటుంబ సభ్యులు
నిమ్మనపల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబం పెళ్లి హడావుడిలో ఉంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్నారు. కూతురికి పెళ్లి చీర తెస్తానని చెప్పి వెళ్లిన తండ్రి చెరువులో పడి మృతిచెందడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన నిమ్మనపల్లి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తవళం పంచాయతీ చౌకిళ్లవారిపల్లికి చెందిన జి.వెంకటరమణ(40) కూలి పనులతో పాటు చేపలు పట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం కూతురు పెళ్లి ఉంది. కూతురికి పెళ్లి చీర తీసుకొస్తానని మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో బయలుదేరిన ఆయన నిమ్మనపల్లి అహోబిలనాయుని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. గాలం తీసే ప్రయత్నంలో కాలుజారి నీటిలో పడిపోయాడు. గాలం పంచెకు తగులుకోవడంతో బయటకు రాలేక చనిపోయాడు. రాత్రయినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య సుమతి, కుటుంబ సభ్యులు చెరువు వద్దకెళ్లి చూశారు. చెరువు ఒడ్డున భర్త చెప్పులు, సెల్‌ఫోన్ ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాలించి, మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ‘కూతురు పెళ్లి చూడకుండా వెళ్లిపోయావా అయ్యా’ అంటూ భార్య రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత ్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.