రేపు దామినేడు వద్ద సంక్షేమ సభ
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:51 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు, ఎన్డీయే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
14 ఎకరాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు, ఎన్డీయే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా మొదట తిరుపతిలో మంగళవారం సంక్షేమంపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద ఇందిరమ్మ గృహ సముదాయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సభావేదిక ఖరారైంది. ఈ సభకు సీఎంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతోపాటు ఐటీ శాఖ మంత్రి లోకేశ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు.
ఏర్పాట్లు ఇలా..
దామినేడు వద్ద సుమారు 14 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మూడెకరాల్లో పార్కింగ్, ఓ ఎకరాలో 20 ఫుడ్ కౌంటర్లు మిగిలిన పది ఎకరాల్లో సుమారు 15వేలమంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మంగళవారం ఉదయం 11 ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. దాదాపు వెయ్యిమందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ సభకు భారీగా తరలిరానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీడీపీ నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఆదివారం జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.